ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు దాదాపుగా ముగిసినట్లేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నివేదిక ద్వారా అభిప్రాయపడింది. ఈ సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టాన్ని.. ఈ సారి వ్యవసాయ రంగం భర్తీ చేయగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. రుతుపవనాలు సకాలంలో దేశంలోకి ప్రవేశించడం, వ్యవసాయ పరిస్థితులు మెరుగుపడటం వంటివి ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది.
వృద్ధికి విధానాల ప్రోత్సాహం..
ఆర్థిక రికవరీలోనూ భారత్ మెరుగ్గా ఉందని నివేదిక పేర్కొంది. ఏప్రిల్‌తో పోలిస్తే జూన్‌లో విడుదలైన ఆర్థిక గణాంకాలు దీన్ని స్పష్టం చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఉద్దీపనలు, ఆర్బీఐ విధానపరమైన నిర్ణయాలతో ప్రగతి రథం వేగం పుంజుకున్నట్లు ఆర్థిక వ్యవహారాల విభాగం వివరించింది.
"అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభంతో సంక్షోభం దాదాపుగా ముగిసినట్ల తెలుస్తోంది. ఏప్రిల్ కన్నా జూన్‌లో ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉండటం.. రికవరీకి సంకేతాలుగా భావించొచ్చు. అయితే కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల రిస్క్ స్థాయి పూర్తిగా తగ్గలేదు."