తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ బీమాతో సైబర్ మోసాల నుంచి రక్షణ!

దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సైబర్ దాడులకు విదేశీ హ్యాకర్లు కుట్రలు చేస్తున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరి ఈ సైబర్ దాడుల వలలో పడకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదైనా నష్టం వాటిల్లితే? ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా? సైబర్ పాలసీల్లో ఇలాంటి నష్టాలకు బీమా లభిస్తుందా? ఈ సందేహాన్నింటికీ సమాధానాలు మీకోసం..

By

Published : Jul 6, 2020, 5:02 PM IST

cyber policy
సైబర్ పాలసీ

కొత్త కొత్త టెక్నాలజీలు సహా ఇంటర్నెట్ ప్రస్తుతం ప్రజల జీవితాల్లో భాగమయ్యాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం చాలా అవసరాలకు ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరి అయ్యింది.

షాపింగ్, వినోదం, ఆర్థిక లవాదేవీలు, డేటా స్టోరేజి, చదువు​ వంటి అవసరాలకు ఇంటర్నెట్​ అధారిత సాధానాలను వాడటం సర్వసాధారణ విషయమైపోయింది. కరోనా వల్ల ఇటీవల వర్క్​ ఫ్రం హోం వంటివి పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్​ దాడులకు అవకాశాలు కూడా భారీగా పెరిగాయి.

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్​టీ-ఇన్) కూడా ఇదే విషయం చెప్పింది. ఇటీవల ఇంటర్నెట్​ వినియోగం, ఆన్​లైన్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 20 లక్షల కంప్యూటర్లపై సైబర్ దాడులు జరగొచ్చని.. జూన్​ 9న హెచ్చరించింది. కరోనా సంక్షోభంలో ప్రభుత్వం నుంచి సహాయమందించే నెపంతో ఈ దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

ఇలాంటి దాడుల్లో డబ్బు కోల్పోవడం, డేటా చోరీ అవ్వడం వంటివి జరిగితే? వాటి నుంచి వచ్చే నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి? అని అలోచించారా? అవును ఇలాంటి నష్టాలు వచ్చినా కూడా మీపై భారం పడకుండా చూసుకునేందుకు అవకాశాలున్నాయి. వ్యక్తిగత సైబర్ సెక్యూరిటీ పాలసీలతో అది సాధ్యమవుతుంది.

సైబర్​ సెక్యూరిటీ పాలసీ అంటే?

సైబర్ దాడిలో ఏదైనా ఆర్థిక నష్టం జరిగితే తిరిగి వాటిని రికవరీ చేసుకునేందుకు ఉపయోగపడేదే సైబర్ సెక్యూరిటీ పాలసీ. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు.

ఈ పాలసీ ఎవరు తీసుకోవాలి?

ఆన్​లైన్​లో ఎక్కువ కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలు చేసే వారంతా ఈ పాలసీ తీసుకోవడం మంచిదే. వివిధ పేమెంట్ యాప్​లు, క్లౌడ్ ఆధారిత సర్వీసులు, హోమ్​ అసిస్టెంట్ వంటివి వినియోంచేవారు కూడా ఈ పాలసీని తీసుకోవడం ఉత్తమం.

సైబర్​ పాలసీ ఇచ్చే కంపెనీలు?

దేశీయంగా మూడు దిగ్గజ సంస్థలు సైబర్ సెక్యూరిటీ పాలసీలను ఇస్తున్నాయి. అవి హెచ్​డీఎఫ్​సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ జనరల్​, ఐసీఐసీఐ లాంబార్డ్​.

వేటికి భద్రత?

సైబర్ పాలసీలతో ముఖ్యంగా గుర్తింపు చౌర్యం, సైబర్ బెదిరింపులు, దోపిడీలు, మాల్వేర్​ల చొరబాటు, మోసపూరిత లావాదేవీతో బ్యాంకు ఖాతాలో నగదు విత్​డ్రా చేయడం వంటి నష్టాలకు బీమా కల్పిస్తాయి. చాలా పాలసీలు చట్టపరమైన అన్ని ఖర్చులను కూడా చెల్లిస్తాయి.

సైబర్ పాలసీ పరిధిలోకి రానివి..

వ్యక్తిగత అనుచిత ప్రవర్తనతో జరిగే నష్టాలకు బీమా వర్తించదు. వీటితో పాటు ప్రభుత్వ ఆదేశాలు వల్ల ఏదైనా నష్టం జరిగితే వాటికీ బీమా చెల్లించవు బీమా సంస్థలు. పాలసీ తీసుకునే ముందు నిజాలు దాచి ఆ తర్వాత నష్టం వాటిల్లితే వాటికీ బీమా వర్తించదు.

అందుబాటులో ఉన్న పాలసీలు..

రూ.600 ప్రీమియం చెల్లిస్తే రూ.లక్ష వరకు బీమా ఇచ్చే సైబర్ సెక్యూరిటీ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

  • హెచ్​డీఎఫ్​​సీ ఎర్గో ఈ@సెక్యూర్ పేరుతో రూ.50 వేల నుంచి రూ.కోటి వరకు బీమా ఇచ్చే పాలసీ అందుబాటులో ఉంది. దీనికి ప్రారంభ వార్షిక ప్రీమియం రూ.1,500గా నిర్ణయించింది హెచ్​డీఎఫ్​సీ.
  • బజాజ్ అలియాంజ్ జనరల్ సైబర్ సేఫ్​ పేరుతో పాలసీని అందిస్తోంది. రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు బీమా కల్పిస్తోంది. ఈ పాలసీ వార్షిక బీమా రూ.700 నుంచి దాదాపు రూ.9 వేలు వరకు ఉంటుంది.
  • ఐసీఐసీఐ లాంబార్డ్​ నుంచి రిటైల్ సైబర్ లయబిలిటి ఇన్సూరెన్స్పాలసీ అందుబాటులో ఉంది. ఈ పాలసీలో కూడా రూ.50 వేల నుంచి రూ.కోటి వరకు సైబర్ బీమా కల్పిస్తోంది. దీనికి రోజుకు రూ. 6.5 నుంచి రూ.65 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

సైబర్ పాలసీల్లో పరిశీలించాల్సిన అంశాలు..

వ్యక్తిగత అవసరాలకు సరిగ్గా సరిపోతుంది అనుకునే పాలసీని ఎంచుకోవాలి. ముఖ్యంగా బీమా నుంచి మినహాయింపుల సెక్షన్​ను క్షుణ్నంగా పరిశీలించాలి. కుటుంబ అవసరాలకు పాలసీ తీసుకుంటే 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఈ పాలసీ వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి.

కోనుగోలు ఎలా?

ఈ పాలసీలన్నీ దాదాపు ఆన్​లైన్​లోనే కొనేందుకు వీలుంది. ఆయా కంపెనీల అధికారిక వెబ్​సైట్ల ద్వారా వీటిని పొందొచ్చు.

పాలసీ ప్రపోజల్ పత్రాలను నింపి, సంబంధిత గుర్తింపు పత్రాలను జతచేసి పంపించాల్సి ఉంటుంది. మీ రిక్వెస్ట్​ను ప్రాసెస్ చేసిన తర్వాత ఆయా కంపెనీలు మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్​కు పాలసీ వివరాలు, డాక్యుమెంట్​లు పంపిస్తాయి. ఆఫ్​లైన్​లో సంబంధిత బ్రాంచ్​లను సంప్రదించి కూడా ఈ పాలసీలను పొందొచ్చు.

ఇదీ చూడండి:పాన్- ఆధార్ అనుసంధానానికి మార్చి వరకు గడువు

ABOUT THE AUTHOR

...view details