తెలంగాణ

telangana

ETV Bharat / business

'2008 ఆర్థిక మాంద్యం స్థాయిలో కరోనా ప్రభావం'

కరోనా ప్రభావంతో ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) అంచనా వేసింది. వైరస్​ వ్యాప్తి మరింత పెరిగితే వృద్ధి రేటు 1.5 శాతానికి పడిపోతుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్​ 4.9 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఫిచ్​ సొల్యూషన్స్​ లెక్కగట్టింది.

virus
కరోనా

By

Published : Mar 2, 2020, 7:34 PM IST

Updated : Mar 3, 2020, 4:50 AM IST

కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా నాలుగో త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఓ అంతర్జాతీయ అధ్యయన సంస్థ వెల్లడించింది. దశాబ్దం క్రితం ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితుల తర్వాత ఆ స్థాయిలో వృద్ధి రేటు పడిపోనుందని తెలిపింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్​ ప్రభావాన్ని విశ్లేషిస్తూ ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ప్రత్యేక నివేదికను రూపొందించింది. ఈ త్రైమాసికంలో తగ్గినా.. ఏడాది మొత్తం చూసినప్పుడు ఆర్థిక వృద్ధి పెరుగుతుందని స్పష్టం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మళ్లీ పుంజుకుంటుందని తెలిపింది.

కొనసాగితే కష్టమే..

2020 సంవత్సరానికి గాను ఆర్థిక వృద్ధి అంచనాను 0.5శాతం కుదించి 2.4 శాతానికి పరిమితం చేసింది ఓఈసీడీ. ఒకవేళ వైరస్​ వ్యాప్తి కొనసాగి ఎక్కువ దేశాలకు విస్తరిస్తే వృద్ధి రేటు 1.5 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది.

"చైనాలో ఉత్పత్తి నిలిచిపోవటం వల్ల ఆసియాపై గట్టి ప్రభావం పడింది. చైనా వస్తువులపై ఆధారపడిన ప్రపంచంలోని అనేక కంపెనీలపై కరోనా ప్రభావం ఉంది. ఈ అంటువ్యాధిని వీలైనంత నియంత్రించి వినియోగదారులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది."

- ఓఈసీడీ నివేదిక

గతంలో వచ్చిన వైరస్​ల కన్నా ఇది అత్యంత ప్రమాదకరమైనదని ఓఈసీడీ అభిప్రాయపడింది. ప్రస్తుతం చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పరం ఆధారపడి ఉండడం, ప్రపంచ వాణిజ్యం, పర్యటకం, వస్తువుల ఉత్పత్తిలో చైనా కీలక పాత్ర పోషించడం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని విశ్లేషించింది.

భారత వృద్ధి 4.9శాతమే: ఫిచ్​

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతమే ఉంటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్​ అంచనావేసింది. కరోనా వైరస్​ ప్రభావంతో సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, దేశీయ డిమాండ్​ బలహీన పడటం వల్ల తయారీ రంగంపై ఒత్తిడి పెరగనుండటమే ఇందుకు కారణమని తెలిపింది.

అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కొంత పుంజుకుని 5.4 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఫిచ్​ వెల్లడించింది.

Last Updated : Mar 3, 2020, 4:50 AM IST

ABOUT THE AUTHOR

...view details