అనేక ఆటుపోట్ల నుంచి కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ రూపంలో అతిపెద్ద భారం పడిందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఫలితంగా ప్రపంచ దేశాలు తీవ్రస్థాయి ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోక తప్పదని ఐఎంఎఫ్ సారథి క్రిస్టాలినా జార్జివా అంచనా వేశారు. వర్ధమాన మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల(ఈఎమ్డీఈ)కు ప్రస్తుత సంక్షోభం ఎన్నో సవాళ్లను విసిరిందని తెలిపారు.
ఈ ఏడాది తొలి భాగంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంగిపోవడం అనివార్యమని.. ఐఎంఎఫ్ వార్షిక సమావేశంలో తెలిపారు క్రిస్టాలినా. వాణిజ్య యుద్ధం, విధానాలపై ఉన్న అనిశ్చితి, ప్రాంతీయ రాజకీయాల్లో ఉద్రిక్తతతో అతలాకుతలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ భారం అదనంగా పడిందన్నారు.