ప్రపంచాన్ని తీవ్ర కలవరపెడుతున్న కొవిడ్-19(కరోనా)ను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు 12 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వివిధ దేశాలు కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు త్వరితగతిన నిధులు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ తెలిపారు. సహాయం కోరిన దేశాలకు ఎనిమిది బిలియన్ డాలర్లు అందజేస్తామని తెలిపారు.
చాలా సభ్య దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. అయితే అవి ఏ దేశాలు అన్నది మాత్రం పేర్కొనలేదు. ముప్పును ఎదుర్కోవడం భారంగా ఉన్న పేద దేశాలను గుర్తించడం ప్రస్తుతం కీలకమైన అంశం అన్నారు. ఇప్పటికే ఆయా దేశాలకు ప్రపంచ బ్యాంకు కేటాయించిన నిధులను కరోనాను అరికట్టేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. అవసరమైన వైద్య సదుపాయాలు, నిపుణులు, విధివిధానాల రూపకల్పనకు వినియోగించాలన్నారు. గతంలో ఎబోలా, జికా వ్యాప్తి సమయంలోనూ ప్రపంచ బ్యాంకు ఈ తరహా చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.