కరోనా సంక్షోభం వేళ భారత్లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) తీపి కబురు అందించింది ప్రపంచ బ్యాంక్. 750 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా 15 కోట్ల పరిశ్రమలకు లబ్ధి చేకూరనుంది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్కు 5.13 బిలియన్ డాలర్లు రుణాల రూపంలో అందించింది ప్రపంచ బ్యాంక్. దశాబ్ద కాలంలో ప్రపంచ బ్యాంక్ అందించిన రుణాల్లో గత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన మొత్తమే అధికం. కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు మూడు నెలల్లో అందించనున్న 2.75 బిలియన్ డాలర్లు ఇందులో భాగమని స్పష్టం చేసింది.
బహుళ దేశాల రుణ అభివృద్ధి విధాన చట్టం కింద ఈ మొత్తాన్ని భారత్కు ఇవ్వనున్నట్లు తెలిపారు ప్రపంచ బ్యాంక్ భారత విభాగ డైరెక్టర్ జునైద్ అహ్మద్. ఎంఎస్ఎంఈలు నగదు కొరత నుంచి బయటపడేందుకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అందించే పథకాల కింద అందించనున్నట్లు వెల్లడించారు.