తెలంగాణ

telangana

ETV Bharat / business

అంచనా కంటే వేగంగా.. ఆటోమేషన్‌ దిశగా అడుగులు! - యాంత్రీకరణ

భారత్​లోని కంపెనీలు యాంత్రీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్​) ఒక నివేదికలో పేర్కొంది. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ అని తెలిపింది. వచ్చే అయిదేళ్లలో 15 రంగాల్లో 8.5 కోట్ల ఉద్యోగాల రూపు మారనుందని అంచనా వేసింది. రోబో విప్లవం వల్ల 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది.

Workforce automating faster than expected; automation, digitisation in India above global avg: Study
అంచనా కంటే వేగంగా.. ఆటోమేషన్‌ దిశగా అడుగులు!

By

Published : Oct 22, 2020, 8:36 AM IST

అంతర్జాతీయ సగటు కంటే వేగంగా భారత్‌లోని కంపెనీలు ఆటోమేషన్‌ (యాంత్రీకరణ) దిశగా అడుగులు వేస్తున్నాయని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఒక నివేదికలో పేర్కొంది. 'ప్రపంచవ్యాప్తంగా 50 శాతం కంపెనీలు ఆటోమేషన్‌ పనులను వేగవంతం చేయగా.. భారత్‌లో 58 శాతం ఆ పనిలో పడ్డాయి. డిజిటలీకరణ యత్నాల్లో భారత్‌లో 87 శాతం కంపెనీలుండగా.. ప్రపంచ సగటు 84 శాతమేన'ని ఆ నివేదిక వెల్లడించింది.

కంపెనీల్లో ఆటోమేషన్‌ ప్రభావంపై ఏడాది పాటు నిర్వహించిన పరిశోధన ప్రకారం.. కరోనా కారణంగా రోబో విప్లవం ముందుగానే వచ్చింది.

వచ్చే అయిదేళ్లలో 26 ఆర్థిక వ్యవస్థల్లో 15 రంగాల్లో 8.5 కోట్ల ఉద్యోగాలు రూపాంతరం చెందే అవకాశం ఉంది.

అదే సమయంలో రోబో విప్లవం వల్ల సరికొత్తగా 9.7 కోట్ల ఉద్యోగాలు వస్తాయనీ తెలిపింది. అయితే ఉద్యోగులకు కంపెనీలు, ప్రభుత్వాల నుంచి మద్దతు లభించాల్సి ఉంటుందని డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది. కొత్తగా వచ్చే ఉద్యోగాలన్నీ నాలుగో పారిశ్రామిక విప్లవ పరిశ్రమలైన కృత్రిమ మేధ వంటి రంగాల్లో రావొచ్చని తెలిపింది.

2025 కల్లా కంపెనీలు మనుషులకు, మెషీన్లకు సమానంగా పనిని విభజించవచ్చు. నైపుణ్యం ఎక్కువ ఉన్నవారికి గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది. మెషీన్లు కేవలం సమాచార, డేటా ప్రాసెసింగ్‌, పాలనపర పనులు చేసే అవకాశం ఉంది. సలహాలు ఇవ్వడం, నిర్వహణ, నిర్ణయాలు, హేతబద్ధ ఆలోచనలు, కమ్యూనికేషన్‌ వంటివి మనుషులే చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హరిత ఆర్థిక ఉద్యోగాలను భర్తీ చేయగల సిబ్బందికి గిరాకీ పెరగవచ్చు.

ప్రపంచ గతిని మార్చే 20 రంగాలు:భవిష్యత్‌ రాతను మార్చగల 20 రంగాలను ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసింది.

బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ యాంటీ వైరల్స్‌, స్పేస్‌ ఫ్లైట్లు, జీన్స్‌-డీఎన్‌ఏ సీక్వెన్స్‌లు, ప్రెసిషన్‌ ఔషధాలు, ఎడ్‌టెక్‌, కృత్రిమ మేధ, శాటిలైట్‌ సేవలు, విద్యుత్‌ వాహనాలు, డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సేవలు, హైపర్‌లూప్‌ ఆధారిత రవాణా సేవలు, కొత్త యాంటీబయాటిక్స్‌, నిరుద్యోగ బీమా.. తదితరాలు అందులో ఉన్నాయి. అయితే ఈ మార్కెట్లను అందిపుచ్చుకోవడానికి భారత్‌తో పాటు స్పెయిన్‌, జపాన్‌ వంటి పలు దేశాలు సామాజిక అభివృద్ధిని సాధించాల్సి ఉందని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details