పొదుపు విషయంలో మహిళలు.. అందరూ అనుకునే దానికన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రపంచ పొదుపు దినోత్సవం సందర్భంగా స్క్రిప్‌బాక్స్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
సర్వేలో పాల్గొన్న మహిళ్లలో 58 శాతం.. ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు, సేవింగ్స్ ఖాతాలో పొదుపు చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది.
ఆరు శాతం మంది మహిళలు మిగులు ఆదాయంతో బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతుండగా.. 15 శాతం మంది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి ఇష్టపడుతున్నామని సమాధానమిచ్చారు.
ఈ నెల మొదటి రెండు వారాల్లో.. ఫేస్బుక్లో ఆదరణ పొందిన గ్రూపుల్లోని 400 మంది మహిళలపై ఈ సర్వే జరిపింది స్క్రిప్‌బాక్స్. సర్వేలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది 2000 సంవత్సరం కన్నా ముందు పుట్టినవారు (మిలీనియల్స్)కాగా.. 46 శాతం మంది నాన్ మిలీనియల్స్.
నాలుగింట మూడొంతుల మంది మిలీనియల్స్.. అధికంగా సేవింగ్స్ చేస్తున్నట్లు సర్వే పేర్కొంది. ప్రతి ఆరుగురిలో ఒక మిలీనియల్ మహిళ సెలవుల్లో విహారయాత్ర కోసం పొదుపు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
నాన్ మిలీనియల్స్‌లో సగం మందికిపైగా మహిళలు.. రిటైర్మెంట్ పథకాల్లో, వారి పిల్లల చదువుల కోసం పొదుపు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. పన్ను మినహాయింపు పథకాలైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసీ,ఫిక్స్డ్ డిపాజిట్లు నాన్ మిలీనియల్ వయస్సు వారికి ఉపయోగపడతాయని 33 శాతం మంది అభిప్రాయపడ్డారు. 26 శాతం మంది వారి ధీర్ఘకాలిక లక్ష్యాలకు మ్యూచువల్ ఫండ్లు ఎక్కువగా ఉపయోగపడుతాయని దృఢంగా విశ్వసిస్తున్నట్లు సర్వే పేర్కొంది.
సర్వేలో పాల్గొన్న మహిళల్లో 28 శాతం మంది తమ ఆర్థిక ప్రణాళికలు.. వారి లక్ష్యాలను నెరవేరుస్తాయని నమ్మకంగా ఉన్నారు. 15 శాతం మంది మాత్రం ఆర్థిక ప్రణాళిక విషయాన్ని వారి భర్తకు గానీ.. ఇంట్లోని ఇతర వ్యక్తులకు గానీ అప్పగిస్తున్నట్లు తెలిసింది. 44 శాతం మంది మంది ఆర్థిక ప్రణాళిక కోసం అదనపు సహాయాన్ని ఆహ్వానిస్తున్నారని సర్వే పేర్కొంది.
ఇదీ చూడండి: పొదుపు చేయడం ఓ కళ.. దాన్ని సొంతం చేసుకోండిలా!