ముడి సరకు వ్యయాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎఫ్ఎంసీజీ(వేగంగా అమ్ముడయ్యే వినియోగ ఉత్పత్తుల) కంపెనీలు అంచనా వేస్తున్నాయి. జూన్ త్రైమాసికంలో తమ నిర్వహణ మార్జిన్లపై కొవిడ్-19 రెండో దశ ప్రభావం పడిందని చెబుతున్నాయి. ముడి సరకు వ్యయాల రూపంలో తమకు ఏప్రిల్-జూన్లో సవాళ్లు ఎదురుకావచ్చని జనవరి-మార్చి త్రైమాసికం ఫలితాల వెల్లడి సమయంలోనే ఏషియన్ పెయింట్స్, బజాజ్ కన్జూమర్ కేర్, డాబర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్, హిందుస్థాన్ యునిలీవర్, పిడిలైట్ ఇండస్ట్రీస్ సంస్థలు తెలిపాయి.
ఆయా సంస్థల ముడి సరకులు ఇవే..
వ్యవసాయ కమొడిటీలు, సుగంధ ద్రవ్యాలు, నూనెలు, ముడి చమురు ఆధారిత ఉత్పత్తులు వంటి వాటిని ఈ సంస్థలు ముడి సరకుగా వినియోగిస్తుంటాయి. జనవరి- మార్చిలో వినియోగ ఉత్పత్తుల రంగానికి చెందిన దిగ్గజ కంపెనీల నిర్వహణ మార్జిన్లు సాధారణ స్థాయిల కంటే తక్కువగా నమోదయ్యాయని బ్రోకరేజీ సంస్థ కోటక్ ఇన్స్ట్రిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. కొన్ని త్రైమాసికాలుగా ఎఫ్ఎంసీజీ సంస్థలు ముడి సరకు వ్యయాల సమస్యను ఎదుర్కొంటున్నాయని, మున్ముందు కూడా స్థూల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని జెఫ్రిస్ విశ్లేషకులు అంచనా వేశారు. ముడి సరకు వ్యయాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఏప్రిల్లో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 2-7శాతం పెంచాయి. మున్ముందు కూడా ధరలు మరింత పంచే అవకాశం ఉందననే సంకేతాలను కూడా ఇస్తున్నాయి. 2021-22 ద్వితీయార్ధంలో కమొడిటీ ధరలు కొంత కిందకు దిగిరావొచ్చని డాబర్ ఇండియా అంచనా వేస్తోంది.