వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు కొరత లేకుండా, ఆర్థిక వృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. కొవిడ్ సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని చర్యలు ఉంటాయని పరిశ్రమ, వ్యాపార వర్గాలకు భరోసా ఇచ్చారు.
పరిశ్రమల విభాగం ఫిక్కీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న దాస్ ఈ విషయాలు వెల్లడించారు.
దేశ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణించినట్లు ప్రభుత్వ గణాంకాల్లో తేలిన తర్వాత.. దాస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. వృద్ధి రేటు ఈ స్థాయిలో పతనమైనట్లు వెలువడిన గణాంకాలు.. కరోనా విధ్వంసానికి నిదర్శనమని చెప్పారు దాస్.