కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఈ పరిస్థితుల్లో సామాన్యులకు నగదు లభ్యతలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. 21 రోజుల లాక్ డౌన్ వ్యవధిలో అన్ని స్థాయిల్లో.. బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, అనుబంధ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు అందేలా చూడాలని వారిని నిర్మల ఆదేశించారు.
నగదు లభ్యతతో పాటు కరోనాపై మోదీ ప్రభుత్వం చేస్తోన్న పోరాటంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర చాలా కీలకం కానుంది. ఎందుకంటే.. కరోనాను ఎదుర్కొనేందుకు పీఎం గరీబ్ కల్యాణ్ పథకం కింద రూ.1.7 లక్ష కోట్ల ప్యాకేజీని ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ పథకానికి సంబంధించిన ఫలాలను ప్రభుత్వ రంగ బ్యాంకులే ప్రజలకు చేరవేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సహకారాన్ని కొనసాగించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్మల కోరారు.
వీటి పాత్రే కీలకం..
కరోనా ఉపశమన ప్యాకేజీ రూ.1.7 లక్షల కోట్లను ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులపైనే సర్కారు యంత్రాంగం ఆధారపడింది. కరోనాతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్యాకేజీని ప్రకటించారు మోదీ.
దేశంలో 20 కోట్ల మంది మహిళలకు జన్ ధన్ ఖాతాలు ఉండగా.. అందులో 95 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న కారణంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయటంలో ప్రభుత్వ రంగ బ్యాంకులే కీలక పాత్ర పోషించనున్నాయి.
బ్యాంకుల ద్వారానే..
దేశవ్యాప్తంగా 38.28 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. అందులో మహిళల ఖాతాలు 53 శాతం. ఈ ఖాతాల్లో నెలకు 500 చొప్పున 3 నెలలపాటు మొత్తం రూ.1.18 లక్షల కోట్లు ప్రభుత్వం అందించనుంది. దీనికి అదనంగా 3 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.1,000లను బ్యాంకుల ద్వారానే బదిలీ చేయనుంది ప్రభుత్వం. అంతేకాకుండా.. ఏప్రిల్ మొదటి వారంలో 8.7 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మొదటి విడతగా రూ.2 వేలు చెల్లించనుంది.