తెలంగాణ

telangana

ETV Bharat / business

Why Rupee is falling: రూపాయీ.. ఎందుకు పడుతున్నావ్‌? - falling rupee price

Why Rupee is falling: భారత రూపాయి మారకం ఇటీవల భారీగా పడిపోయింది. ఆసియాలో అధికంగా క్షీణించి, అధ్వాన పనితీరుతో కొనసాగుతోంది. అసలు రూపాయి బలహీనతకు కారణాలు ఏంటి? దీని ప్రభావం ఎలా ఉంటుంది?

Why rupee falling
Why rupee falling

By

Published : Dec 26, 2021, 6:42 AM IST

Asia's Worst Currency: ఆసియాలోనే అత్యంత అధ్వాన పనితీరును ప్రదర్శిస్తున్న కరెన్సీగా భారత రూపాయి మారుతోంది. ఈ త్రైమాసికంలో ఇప్పటికే 2.2 శాతం మేర క్షీణించింది. ఒక సమయంలో 20 నెలల కనిష్ఠానికి చేరిన దాఖలాలూ ఉన్నాయి. ఆ లెక్కన ఈ ఏడాదిని రూపాయి ప్రతికూలంగానే ముగించేలా కనిపిస్తోంది. అలా ఎందుకు జరుగుతోంది? రూపాయి బలహీనతలతో మనపై ఏం ప్రభావం ఉంటుంది? అన్నవే అసలు ప్రశ్నలు.

Rupee falling explanation

రూపాయి బలహీనతలకు చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక దానితో మరొకటి సంబంధం ఉన్నవే. ముందుగా చెప్పుకోవాల్సింది కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ గురించే. అతి తక్కువ వ్యవధిలోనే ఇది ఎక్కువ దేశాల్లో వ్యాపించింది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ తరహా పరిస్థితులను తీసుకొచ్చింది. కొన్ని దేశాలు క్రిస్మస్, కొత్త ఏడాది ప్రారంభం తర్వాత లాక్‌డౌన్‌ విధించడానికి సిద్ధమవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 2022లో దశల వారీగా వడ్డీ రేట్లు పెంచుతామని స్పష్టం చేసింది. ఇటీవలే గోల్డ్‌మాన్‌ శాక్స్‌, నొమురా హోల్డింగ్స్‌లు భారత ఈక్విటీలపై తమ అంచనాలను తగ్గించాయి. ఇప్పటికే అధిక విలువలకు చేరాయన్నది వీటి భావన. ఈ అంశాలతో విదేశీ మదుపర్లు మన స్టాక్‌ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ త్రైమాసికంలో దాదాపు 4 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.30,000 కోట్లు)ను వెనక్కి తీసుకున్నారు. వీటన్నిటికి తోడు.. వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరడం, కరెంట్‌ ఖాతాలోటు పెరగడంతో రూపాయి క్షీణిస్తోంది.

ఆర్‌బీఐ ఏం చేస్తోంది?

RBI rupee intervention: రూపాయి క్షీణత సమయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంటుంది. ఎందుకంటే బలహీన కరెన్సీ ఎగుమతులకు మద్దతు ఇస్తుంది. కరోనా సమయంలో ఆర్థిక రికవరీ పుంజుకోడానికి ఇది అత్యంత ముఖ్యం. అదే సమయంలో దిగుమతుల బిల్లు భారం పెరుగుతుంది. దీని వల్ల ఎక్కువ కాలం పాటు వడ్డీ రేట్లను రికార్డు కనిష్ఠ స్థాయిల వద్ద ఉంచడానికి ఆర్‌బీఐకి వీలు కాదు. దిగుమతుల భారం వల్ల నవంబరులో వాణిజ్య లోటు ఆల్‌టైం గరిష్ఠమైన 2300 కోట్ల డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ డాలర్లను కొనుగోలు చేసి వ్యవస్థలో ద్రవ్యలభ్యత ఉండేలా చేసింది. ఇప్పటిదాకా 6000 కోట్ల డాలర్ల మేర విదేశీ మారకపు నిల్వలను జత చేసినా కూడా రూపాయి క్షీణించడం గమనార్హం. 2022లోనూ రూపాయి క్షీణత నివారించడానికి ఇదే పనిచేయడం కొంత కష్టమేనన్నది విశ్లేషకుల వాదనగా ఉంది.

సానుకూలాంశాల్లేవా?

రూపాయిని బలోపేతం చేసే సానుకూలాంశాలూ ఉన్నాయి. ఏడాది చివరిలో విదేశీ మదుపర్లు అమ్మకాలకు దిగడం మామూలేనని, రాబోయే త్రైమాసికంలో విదేశీ పెట్టుబడులు తిరిగి భారత్‌లోకి వస్తాయన్న అంచనాలున్నాయి. అతిపెద్ద ఐపీఓ ఎల్‌ఐసీ మార్చిలోపే మార్కెట్‌కు రానుంది. ఇది రూపాయిని బలోపేతం చేయగలదని యూబీఎస్‌ ఏజీ అంటోంది. ఇతరత్రా ఐపీఓల సందడి కూడా కాస్త ఊతమిచ్చే అంశమే.

ఎందాకా ఈ పయనం..

ముడి చమురు ధరలు అదుపులో ఉంటే, డాలర్‌ మారకపు విలువ ఈ ఆర్థిక సంవత్సరం చివరికి రూ.74-75 స్థాయిల్లోనే ఉండొచ్చని యూబీఎస్‌ విశ్లేషకులు అంటున్నారు. మార్చి చివరకు 78 స్థాయికి కూడా చేరొచ్చని.. ఇది ఏప్రిల్‌ 2020 నాటి రికార్డు కనిష్ఠ స్థాయి అయిన 76.9088 కంటే కూడా కనిష్ఠమేనని మరో అంతర్జాతీయ బ్రోకరేజీ అంటోంది. బ్లూమ్‌బర్గ్‌ సర్వే అయితే రూ.76.50 వరకు వెళ్లొచ్చని అంటోంది. అప్పటికి కూడా 4 శాతం నష్టమే. అది కూడా వరుసగా నాలుగో ఏడాది నష్టాలతో ముగించినట్లవుతుంది.

లాభ నష్టాలేమిటంటే..

రూపాయి విలువ క్షీణిస్తే దిగుమతి వ్యయాలు భారీగా పెరుగుతాయి. మనం ఎక్కువగా దిగుమతి చేసుకునేది ముడి చమురే కాబట్టి దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ఆహార ధరలపైనా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే నిత్యావసర ధరలకు ఆజ్యం పోసే రవాణా ధరలు పెరుగుతాయి కాబట్టి. ఇక విదేశీ విద్య కూడా ప్రియమవుతుంది. విదేశీ ప్రయాణాలూ ఖరీదవుతాయి. ఇక లాభమేమిటంటే.. ఎగుమతిదారులకు లాభపడతారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు దీని వల్ల డాలర్ల రూపేణ ఎక్కువ ప్రయోజనం పొందుతాయి.

ఇదీ చదవండి:రూ.2000 నోట్లు బాగా తగ్గాయ్‌.. ఏమయ్యాయంటే..?

ABOUT THE AUTHOR

...view details