ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరికీ నేర్పిన పాఠం ఏదైనా ఉంది అంటే.. అది ఆరోగ్య సంరక్షణ. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైతే ఆర్థికంగా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తే.. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు ఉన్న ఉత్తమ మార్గం ఆరోగ్య బీమా.
ప్రస్తుతం మార్కెట్లో అనేక బీమా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ అవసరాలకు తగ్గట్లు.. మీతో పాటు మీ కుటుంబానికి కూడా రక్షణ కల్పించే బీమా తీసుకోవడం ఎంతో ముఖ్యం. సగటు వ్యక్తి జీవితంలో వివిధ దశల్లో ఆరోగ్య బీమా ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం.
పెళ్లి కాని యువత
ఈ వయసులో సాధారణంగా బాధ్యతలు కాస్త తక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ వయసులో ఉన్నప్పుడే మంచి ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది భవిష్యత్ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది.
చిన్న వయసులో ఆరోగ్య బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా చెల్లించి, లాభాలు ఎక్కువగా పొందే వీలుంది. దీనితో పాటు 'నో క్లెయిమ్ బోనస్' పొందే అవకాశాలు ఉంటాయి. ఏడాదిలో ఒక్కసారి కూడా బీమా క్లెయిమ్ చేసుకోకుంటే.. బీమా కంపెనీలు కొంత మొత్తాన్ని బోనస్‌గా ఇస్తాయి. దానినే 'నో క్లెయిమ్ బోనస్' అంటారు.
పెళ్లై పిల్లలు ఉంటే..
ఈ దశలో మీకు పూర్తి స్థాయి ప్రమాద ఆరోగ్య బీమా అవసరం. ఎందుకంటే ఈ దశలో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. మెడికల్ ఖర్చులు జీవితాన్ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. ఇది మీ పిల్లలో చదువు, భవిష్యత్‌ను కూడా దెబ్బతీయొచ్చు.
ఈ దశలో కుటుంబ సభ్యులు, వైద్య అవసరాలకు తగ్గట్లు.. అందరికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ, సభ్యులందరికీ కలిపి వేరు వేరు పాలసీలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.