తీసుకున్న రుణాన్ని మీరు ఎలా చెల్లిస్తున్నారు.. ఇదే భవిష్యత్తులో మీరు తీసుకోవాలనుకున్న కొత్త రుణ అవకాశాలను నిర్ణయిస్తుంది. ఆ చెల్లింపుల తీరు వివరించే క్రెడిట్ స్కోరు ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ కీలకంగా మారింది. ఈ మూడంకెల సంఖ్య 750కి మించి ఉంటే.. మీకు రుణ పరపతి బాగా ఉన్నట్లు లెక్క. అంతకు తగ్గితే.. కొత్త రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకునే సందర్భంలో కొన్ని చిక్కులు తప్పవు.
అధిక వడ్డీ..
రుణ దరఖాస్తుదారులకు వడ్డీ రేట్లను నిర్ణయించేటప్పుడు రుణదాతరలు నష్టభయం ఏ మేరకు ఉందనేది పరిశీలిస్తాయి. దీన్ని బట్టే వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. అధిక క్రెడిట్ స్కోరు ఉన్న రుణ దరఖాస్తుదారులు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం అయ్యే అవకాశాలు తక్కువ. కాబట్టి, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించడం ద్వారా బ్యాంకులు ఇలాంటి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారు రుణాల చెల్లింపులో విఫలం అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారికి బ్యాంకులు కాస్త అధిక వడ్డీని వసూలు చేయడం ద్వారా క్రెడిట్ రిస్క్‌ను సర్దుబాటు చేసుకుంటాయి. కాబట్టి, మంచి క్రెడిట్ స్కోరు లేకపోతే అధిక వడ్డీ చెల్లించేందుకు సిద్ధం కావాల్సిందే.
క్రెడిట్ కార్డులు రాకపోవచ్చు..
క్రెడిట్ కార్డు ఇప్పుడు కేవలం కొనుగోళ్లు, చెల్లింపులు, నగదు కోసం తక్షణ రుణాన్ని అందించేది మాత్రమే కాదు. క్రెడిట్ కార్డు ద్వారా రివార్డు పాయింట్లు, నగదు వెనక్కి, రాయితీలు, ఉచిత గిఫ్ట్ కార్డులు, వోచర్లు ఇలా ఎన్నో వెసులుబాట్లు ఉంటున్నాయి. వీటన్నింటి వల్లా ఎంతోకొంత డబ్బును ఆదా చేసుకోగలం. దీన్ని క్రమశిక్షణతో ఉపయోగిస్తే.. కార్డు ప్రయోజనాల రూపంలో అందిన మొత్తం వార్షిక ఫీజుకన్నా అధికంగానే ఉంటుంది. కొత్తగా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కార్డు జారీ సంస్థలు క్రెడిట్ స్కోరును ప్రధానంగా చూస్తాయి. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారి దరఖాస్తులను తిరస్కరించేందుకే ఎక్కువ అవకాశాలుంటాయి.
రుణ బదిలీ కష్టమే..