టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 2వ నెలలోనూ పెరిగింది. ఆహారపదార్థాలు, ఇంధన ధరలు పెరగటం వల్ల మార్చిలో డబ్ల్యూపీఐ 3.18 శాతానికి చేరింది. ఇది ఫిబ్రవరిలో 2.93 శాతంగా ఉండగా... గత సంవత్సరం మార్చిలో 2.74 శాతంగా ఉంది.
కూరగాయలు, ఇంధనం ఇలా...
కూరగాయల ధరల పెరుగుదలతో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం క్రితం నెల కంటే ఎక్కువైంది. మార్చిలో కూరగాయల ధర 28.13 శాతం పెరిగింది. ఫిబ్రవరి కంటే ఇది 6.82 శాతం ఎక్కువ. బంగాళదుంప ధరల్లో పెరుగుదల మాత్రం 23.40 శాతం నుంచి 1.30 శాతానికి తగ్గింది.
మొత్తం ఆహారపదార్థాల ద్రవ్యోల్బణం 5.68 శాతంగా ఉంది. ఇంధనం, విద్యుచ్ఛక్తి విభాగంలో ధరల పెరుగుదల 5.41 శాతానికి ఎగబాకింది. ఇది గత నెలలో 2.23 శాతంగా ఉంది.