అన్ని రూపాల్లో వచ్చిన వార్షిక ఆదాయాన్ని, అదే విధంగా పన్ను చెల్లింపు వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేదే ఆదాయ పన్ను రిటర్ను(ఐటీఆర్). ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారు తప్పకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి. మినహాయింపు ఉన్న వారు దాఖలు చేయాల్సిన అవసరం లేదు.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మౌలిక మినహాయింపు స్థాయి దాటిన వారు తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాలి. అయితే మినహాయింపులతో కూడిన ఆదాయాన్ని మాత్రమే దీనికి పరిగణనలోకి తీసుకోవాలి.
వయస్సు | మినహాయింపు ఆదాయం |
60 ఏళ్ల లోపు | రూ. 2.5 లక్షలు |
60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు | రూ. 3 లక్షలు |
80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ | రూ. 5 లక్షలు |
అప్పుడు కూడా ఐటీఆర్ దాఖలు చేయాల్సిందే..
ఆదాయంతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
- విదేశాలకు సొంత ప్రయాణం, ఇతరుల ప్రయాణంపై రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు
- ఏదైనా బ్యాంకుకు చెందిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో రూ. కోటి కంటే ఎక్కువ మొత్తం జమ చేసినప్పుడు
- రూ. లక్ష కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు వచ్చినప్పుడు
- విదేశాల నుంచి ఆదాయం ఆర్జిస్తున్న వారు, విదేశాల్లో ఆస్తులున్న వారు, విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు
రీఫండ్ పొందొచ్చు..
నిబంధనల ప్రకారం మరికొన్ని సందర్భాల్లోనూ రిటర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) రూపంలో కొన్ని సార్లు పన్ను చెల్లించి ఉండే అవకాశాలు ఉంటాయి. టీడీఎస్ అంటే ఆదాయం లభించే వద్దే పన్ను చెల్లించటం. వార్షిక ఆదాయం ప్రకారం మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అప్పుడు రీఫండ్ లభిస్తుంది. దీనికోసం రిటర్నులు తప్పకుండా దాఖలు చేయాలి. రిటర్ను దాఖలు చేయటం ద్వారానే పన్ను రీఫండ్ పొందవచ్చు.