దాదాపు ప్రతి భారతీయుడి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది. ఎక్కువగా మహిళల ఆభరణాల రూపంలో ఉంటుంది. ఇంట్లో బంగారం ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బంగారానికి ఉన్న మంచి డిమాండ్ వల్ల దానిని ఎప్పుడైనా నగదు రూపంలోకి మార్చుకోవచ్చు.
ఒకప్పుడు బంగారంపై పెట్టుబడి అంటే కేవలం భౌతిక బంగారమే. కానీ మారిన పరిస్థితులతో.. డిజిటల్ వేదికల ద్వారా బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. బంగారం ధర అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.
బంగారం అనేది ఒకప్పుడు వస్తు కొనుగోలుకు ఉపయోగించే వారు. ఇప్పటికీ ఇదే అత్యున్నత కరెన్సీ అనుకోవచ్చు. ఏఏ దేశంలోనైనా బంగారం చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఇది చాలా సురక్షితమైన పెట్టుబడి. దీని ధర కూడా ప్రధానంగా డిమాండ్, సరఫరాలపై ఆధారపడి ఉంటుంది. సరఫరా ఎక్కువైతే ధర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ బంగారం సరఫరా పరిమితంగా ఉంటుంది.
డాలర్‌కు బంగారానికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే డాలర్ బలహీనపడితే ఇతర కరెన్సీల విలువ పెరుగుతుంది. దీనివల్ల ఆయా కరెన్సీలలో ఉండాల్సిన దానికంటే తక్కువ మొత్తానికే బంగారం లభిస్తుంది. దీనితో డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల బంగారం ధర కూడా పెరుగుతుంది.
స్టాక్ మార్కెట్లు పడిపోతే బంగారం పెరుగుతుంది
బంగారం అనేది సురక్షితమైన పెట్టుబడి. ఆర్థిక వ్యవస్థ మంచి ప్రదర్శన కనబర్చని పక్షంలో స్టాక్ మార్కెట్లు, ఇతర పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీనివల్ల పెట్టుబడులన్నీ బంగారం వైపు మళ్లుతాయి. దీనివల్ల ధర పెరుగుతుంది. కరోనా ప్రారంభంలో బంగారం ధర విపరీతంగా పెరగటం చూశాం. ఆ సమయంలో స్టాక్ మార్కెట్లు ప్రతికూల వృద్ధిని సాధించాయి.
ద్రవ్యోల్బణం విషయంలో హెడ్జింగ్ టూల్‌గా బంగారం ఉపయోగపడుతుంది. ఒకటి పడిపోయినప్పుడు దాని ప్రభావాన్ని తగ్గించేందుకు ఉపయోగించే సాధనమే హెడ్జింగ్ టూల్. బంగారం ధర కూడా జీవన శైలి ఖర్చు పెరిగినప్పుడు పెరుగుతుంది.