కరోనా మహమ్మారి విజృంభణ అనంతరం కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు కేటాయింపుల వైపు ఆశగా ఎదరుచూస్తున్నారు. కరోనా వల్ల వివిధ రంగాల దెబ్బతిన్న వేళ తమ రంగానికి కేటాయింపులు జరపాలని, రాయితీలు ప్రకటించాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. ఇంతకీ ఈ బడ్జెట్ నుంచి పరిశ్రమ వర్గాలు ఏం ఆశిస్తున్నాయ్.. వాటి ఆకాంక్షలేంటో ఇప్పుడు చూద్దాం..
రియల్ ఎస్టేట్
ఈ సారి బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం భారీగానే ఆశలు పెట్టుకుంది. ఉపాధి కల్పనకు కేంద్రమైన ఈ రంగానికి కొన్ని రాయితీలు ప్రకటించాలని రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన సంస్థ క్రెడాయ్ కోరుతోంది. ముఖ్యంగా గృహ రుణ చెల్లింపుల విషయంలో కొనుగోలుదారులకు సెక్షన్ 80సి కింద ఉన్న పరిమితిని పెంచాలని కోరుతోంది. అలాగే, నిర్మాణ వ్యయం పెరగకుండా చర్యలు ఉండాలంటోంది.
- ఇదీ చూడండి:ఇలా చేస్తేనే 'రియల్' జోష్!
హెల్త్, ఫార్మా
కరోనా వేళ ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగాల పేర్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పటికే ఫార్మా రంగంలో రారాజుగా పేరొందిన మన దేశంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) పరంగా మరింత ముందుకెళ్లాల్సి ఉందని ఆ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అందుకోసం ఆర్ అండ్ డీపై చేసే ఖర్చుకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు ఇవ్వాలని ఫార్మా కంపెనీలు కోరుతున్నాయి.
జీడీపీలో ఆరోగ్య సంరక్షణ వాటా పెంచాలని సూచిస్తున్నారు బయోకాన్ లిమిటెడ్ చీఫ్ కిరణ్ మజుందర్ షా.
- ఇది చూడండి:'ఆరోగ్య' భారతానికి ఊతమిస్తారా?