ఖచ్చితమైన రాబడిని ఇచ్చే పెట్టుబడి సాధనం ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్‌డీ). ఇందులో మదుపు చేసేందుకు కీలకమై అంశం వడ్డీ రేటు అనడంలో సందేహం లేదు. సాధారణంగా కో-ఆపరేటీవ్, స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. వాణిజ్య బ్యాంకులు వీటితో పోల్చితే కొంత తక్కువ వడ్డీ రేటును ఇస్తాయి. అయితే ఎఫ్‌డీ విషయంలో వడ్డీ రేటు కీలమైనప్పటికీ ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు వ్యక్తిగత ఆర్థిక నిపుణులు.
భద్రత
ఫిక్స్డ్ డిపాజిట్‌ను సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు డిపాజిట్‌కు బీమా ఉంటుంది. వడ్డీ, అసలుకు కలిపి ఈ బీమాను రూ.5 లక్షలుగా నిర్ణయించింది ప్రభుత్వం. కొన్ని చిన్న తరహా బ్యాంకుల బీమా ప్రీమియంలు చెల్లించకపోవచ్చు. అందుకే డిపాజిట్ చేసే ముందే ఆ బ్యాంక్‌కు బీమా ఉందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లకు భద్రత ఎక్కువగా ఉంటుంది. షెడ్యూల్డ్ బ్యాంకులకూ ఈ బీమా వర్తిస్తుంది.
విశ్వసనీయత
ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవని అనుకున్నప్పటికీ.. 100 శాతం రిస్కు లేదని కాదు. ఎన్బీఎఫ్సీ, కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఇటీవల చూసిన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. వాణిజ్య బ్యాంకుల్లో ఎఫ్‌డీ తీసుకోవటం వల్ల బీమా ఉంటుంది. కో-ఆపరేటివ్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. ఎన్బీఎఫ్సీల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే.. ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి, క్రెడిట్ రేటింగ్ లాంటి విషయాల గురించి తెలుసుకోవాలి.