రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను తగ్గించింది లేదా పెంచింది లేదా యథాతథంగా ఉంచింది.. ఇలా ఏదో ఒక వార్త రెండు నెలలకోసారి వింటుంటాం. ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన.. ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంటుంది.
రెపో, రివర్స్ రెపో రేట్లనే కీలక వడ్డీ రేట్లు అంటారు. వీటి ప్రభావం సామాన్యుడిపై ప్రత్యక్షంగా ఉండకపోయినా పరోక్షంగా మాత్రం ఉంటుంది. అదెలానో ఇప్పుడు చూద్దాం.
రెపో రేటు..
బ్యాంకులు తమ అవసరాలకు.. రిజర్వు బ్యాంక్ నుంచి తీసుకునే రుణంపై చెల్లించే వడ్డీనే రెపో రేటు అంటారు. బ్యాంకుల వద్ద ద్రవ్యలభ్యత తక్కువున్న సమయంలో ఇలా రుణం తీసుకుంటాయి.
రివర్స్ రెపో రేటు
బ్యాంకులు తమ వద్ద అదనంగా ఉన్న నగదును ఆర్బీఐ వద్ద జమ చేస్తుంటాయి. ఇందుకు ఆర్బీఐ ఆయా బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అంటారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలభ్యత పెరిగి ద్రవ్యోల్బణం ఎక్కువైనా కూడా ఆర్బీఐ.. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుంది.
రెపో, రివర్స్ రెపో రేటు ఎంత ఉండాలి అనే విషయంపై తుది నిర్ణయం ఆర్బీఐదే.
రివర్స్ రెపో రేటు సాధారణంగా రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదును వ్యక్తులకు లేదా సంస్థలకు అప్పుగా ఇవ్వాలి. ఒక వేళ రివర్స్ రెపో రేటు ఎక్కువగా ఉంటే.. బ్యాంకులు ఆర్బీఐ వద్ద జమ చేసేందుకే మొగ్గు చూపుతాయి. అందుకే.. రివర్స్ రెపో రేటును తక్కువగా ఉండేట్లు చూసుకుంటుంది ఆర్బీఐ.
సామాన్యులపై ప్రభావం ఉంటుందా?
ఆర్బీఐ రెపో రేటు తగ్గించినట్లయితే బ్యాంకులు తీసుకునే వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. దీని వల్ల బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే వ్యక్తులు, సంస్థలకు కూడా వడ్డీ భారం తగ్గుతుంది.
ఇంతకు ముందు ఇలా..
కొంత కాలం క్రితం వరకు ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పటికీ.. బ్యాంకులు మాత్రం రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేవి కావు. డిపాజిట్ రేట్లు తగ్గకపోవటమే దీనికి కారణమని బ్యాంకులు చెప్పేవి. అయితే ఎక్స్టర్నల్ బెంచ్ మార్కులకు.. రిటైల్ రుణాల వడ్డీ రేట్లను అనుసంధానించాలని ఆర్బీఐ కొన్నాళ్ల క్రితం వాణిజ్య బ్యాంకులకు సూచించింది. దీనితో తగ్గిన రెపో రేటు ఫలితాలను రుణ గ్రహీతలకు బదిలీ చేయడం ప్రారంభించాయి బ్యాంకులు.
అయితే ఇదే కారణం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు తగ్గుతుంటాయి. ఇది పెట్టుబడులు పెట్టే వారికి కాస్త ప్రతికూల అంశమే అని చెప్పొచ్చు.
ఇదీ చదవండి:కీలక వడ్డీ రేట్లు మరోసారి యథాతథమే!