తెలంగాణ

telangana

ETV Bharat / business

సామాన్యులపై ద్రవ్యోల్బణం ప్రభావం ఎంత?

ధరల పెరుగుదల.. ఇది దేశ ఆర్థిక విధానాలు నిర్ణయించటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కీలక వడ్డీ రేట్లు నిర్ణయించేందుకు ఇదే కీలకం. ప్రతి నెలా దీనికి సంబంధించిన గణాంకాలు విడుదల అవుతాయి. సీపీఐ, డబ్ల్యూపీఐ రూపంలో ధరల పెరుగుదల గణాంకాలు వెలువడుతుంటాయి. ఇంతకీ ఏమిటీ సూచీలు? వాటితో సామాన్యులకు ఉన్న సంబంధం ఏమిటి?

How would Inflation count
ద్రవ్యోల్బణం ఎలా లెక్కిస్తారు

By

Published : Jun 11, 2021, 1:55 PM IST

సాధారణ ధరల స్థాయిలో నిరంతర వస్తు సేవల ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. దేశంలో వస్తు సేవల ధరల్లో పెరుగుదల గణాంకాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. సీపీఐ (వినియోగదారు ధరల సూచీ), డబ్ల్యూపీఐ(టోకు ధరల సూచీ)లు దేశంలో ద్రవ్యోల్బణాన్ని తెలియజేస్తాయి.

సీపీఐని ఎలా లెక్కిస్తారు?

నిత్యవసరాల ధరలను పరిగణనలోకి తీసుకుని ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు. వినియోగదారుడి స్థాయిలో ధరల పెరుగుదలను సీపీఐ ద్వారా తెలుసుకోవచ్చు. రక రకాల వస్తు సేవలకు వేరు వేరు వెయిటేజీని ఇచ్చి సీపీఐను గణిస్తారు.

వస్తు సేవలకు(ఉదాహరణ- ఆహారపదార్థాలు) ప్రత్యేకంగా ఇండెక్స్​ను కూడా గణిస్తారు. సీపీఐ అనేది జీవన శైలి వ్యయాల్లో పెరుగుదలను తెలియజేయదు.

సీపీఐలో ఆహారపదార్థాలకు వెయిటేజీ 50 శాతం ఉంది. ఇళ్లలో 50 శాతం వ్యయం ఆహారంపై చేయకపోవచ్చు. ఆరోగ్యం, విద్య, రవాణా లాంటి వాటిపై ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలుంటాయి. వీటిలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల ద్రవ్యోల్బణం జీవన శైలి వ్యయంలో పెరుగుదలను పూర్తిగా తెలుపకపోవచ్చు. సీపీఐని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్​ఎస్​ఓ) విడుదల చేస్తుంది.

టోకు ద్రవ్యోల్బణం

హోల్ సేల్ స్థాయిలో ధరల పెరుగుదలను డబ్ల్యూపీఐ తెలియజేస్తుంది. అంతేకాకుండా హోల్ సేల్ ధరలు వస్తువులు, ఆహార పదార్థాలకు మాత్రమే ఉంటాయి కానీ సేవలకు ఉండవు. అందుకే డబ్ల్యూపీఐలో సేవలు ఉండవు. డబ్ల్యూపీఐలో ఇంధనం లాంటి వాటి విషయంలో అంతర్జాతీయ ధరలను ఆధారంగా తీసుకుంటారు. దీనివల్ల డబ్ల్యూపీఐ, సీపీఐకి మధ్య తేడా ఉంటుంది. హోల్​ సేల్ ధరల గణాంకాలను వాణిజ్య శాఖ విడుదల చేస్తుంది.

సామాన్యులపై ప్రభావం..

సీపీఐ రూపంలో కొలుస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణంలో ప్రజలు రోజు వారీగా ఉపయోగించే వస్తు సేవల ధరల పెరుగుదల ఇమిడి ఉంటుంది. దీని ద్వారా స్థూలంగా కొంత వరకు ఖర్చుల పెరుగుదలను అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆహార పదార్థాలకు సంబంధించి సీఎఫ్​పీఐని కూడా ఎన్​ఎస్​ఓ విడుదల చేస్తుంది. దీని ద్వారా ఆహార పదార్థాల్లో వ్యయ పెరుగుదలను తెలుసుకోవచ్చు. అయితే ఇది సీజన్​ను బట్టి మారుతుందని గుర్తుంచుకోవాలి.

డబ్ల్యూపీఐకి వినియోగదారుడికి ప్రత్యక్షంగా సంబంధం ఉండదు. పరోక్షంగా రిటైల్ ధరల ద్వారానే వినియోగదారుడిపై ప్రభావం పడుతుంది. ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే.. ఇప్పుడు రూ.100 ఉన్న వస్తువు ధర.. 10 శాతం ద్రవ్యోల్బణం పెరిగితే.. రూ.110కి చేరుకుంది.

దేశంలో ద్రవ్యోల్బణం అధికమైనప్పుడు ఆర్‌బీఐ ద్రవ్యవిధానాన్ని అనుసరించి దాన్ని నియంత్రిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో అనుకోని పరిస్థితులు తలెత్తినప్పుడు ద్రవ్య సరఫరాలో మార్పు చేసి ఆ పరిస్థితులను సరిచేసేదే ద్రవ్య విధానం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details