తెలంగాణ

telangana

ETV Bharat / business

బీమా పత్రాలకు ధీమానిచ్చే ఈ-ఇన్సూరెన్స్

ఆరోగ్య, జీవత, వాహన బీమా ఇలా రకరకాల బీమాలు తీసుకుని.. ఆ పత్రాలను ఇంట్లో దాచినా సరే అవి కొన్ని సార్లు దొరకవు. ఇల్లు సర్దే సమయంలో వాటిన పోగొట్టుకోవడం వంటివీ జరుగుతుంటాయి. మళ్లీ వాటిని తిరిగి పొందాలంటే బీమా సంస్థల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య లేకుండా.. డిజిటల్ రూపంలో సురక్షితంగా, ఎప్పుడైనా, ఎక్కడైనా బీమా పత్రాలను చూసుకునేందుకు వీలుగా ఓ సదుపాయం అందుబాటులో ఉంది. అదే ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ (ఈ-ఇన్సూరెన్స్). ఇంతకీ దీనిని ఎలా తీసుకోవాలి?

What is E-Insurance
ఈ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి

By

Published : Dec 3, 2020, 6:08 PM IST

బీమాకు సంబంధించిన పత్రాలన్నీ దాచిపెట్టటం ఇబ్బందిగా ఉందా? దొంగతనానికి గురికాకుండా లేదా పోగొట్టుకోకుండా ఉండేందుకు పాలసీ పేపర్లను భద్రందా దాచుకోవాలనుకుంటున్నారా? ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా వాటిని చూసుకునేందుకు వీలుంటే బాగుండు అని ఆలోచిస్తున్నారా? అలాంటి అవసరాలను తీర్చేందుకు ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్(ఈఐఏ) సరిగ్గా సరిపోతుంది. పైగా దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండవు.

మరి ఈ ఖాతా ఎలా తీసుకోవాలి, ఫీచర్లు ఏమిటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ-ఇన్సూరెన్స్ ఖాతా ఒక రిపాజిటరీ లాంటిది. దీని ద్వారా జీవిత బీమా, ఆరోగ్య బీమా ఇతర బీమాలను ఒకే దగ్గర నిర్వహించుకోవచ్చు. ఇందులో ఉన్న పాలసీలను ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ పాలసీలుగా పరిగణిస్తారు.

స్టాక్ మార్కెట్లలో డీమ్యాట్ ఎలానో బీమాకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అలాంటిది. ఒక్కొక్కరు ఒక అకౌంట్ తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఎందుకు అవసరం?

ఈ ఖాతాలో అన్ని పాలసీలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్​లో ఉంటాయి కాబట్టి ఎలాంటి పేపర్లతో పని ఉండదు. పోగొట్టుకోవటం, దొంగతనానికి గురవటం అనే సమస్యే ఉండదు. ఈ ఖాతా ద్వారా ఒకే దగ్గర అన్ని పాలసీలు చూసుకోవచ్చు. దీనివల్ల రెన్యూవల్ తేదీ, మెచ్యూరిటీ తేదీ, మెచ్యూరిటీ మొత్తం తదితరాలను ఒకే దగ్గర తెలుసుకోవచ్చు.

పాలసీలకు సంబంధించి వార్షిక స్టేట్​మెంట్ కూడా ఈ అకౌంట్ ద్వారా లభిస్తుంది. దీనివల్ల పాలసీలను సమాచారాన్ని తెలుసుకోవటం నిర్వహించుకోవటం సులభం అవుతుంది. ఒకసారి ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్​ను తెరిచినట్లైతే పాలసీ రెన్యూవల్, పాలసీ గడువు వంటివాటిని రిమైండ్​ పెట్టుకునేందుకు వీలుంటుంది. దీనివల్ల పాలసీ ల్యాప్స్​ను నివారించుకోవచ్చు. ఈ ఖాతా వల్ల ప్రీమియాన్ని ఆన్​లైన్ ద్వారా చెల్లించుకోవచ్చు.

ఈ ఖాతా ఉండే కేవైసీ అప్​డేట్ చేయటం చాలా సులభం అవుతుంది. ఒకసారి ఈ ఖాతాలో కేవైసీ పూర్తయితే.. కొత్త పాలసీ తీసుకునే సమయంలో మళ్లీ కేవైసీ అవసరం ఉండదు. దానికి బదులు ఈ-ఇన్సూరెన్స్ ఖాతా నంబర్​ ద్వారా సులబంగా కొత్త పాలసీని పొందొచ్చు.

ఒక పాలసీలో మన పేరు, చిరునామా తదితర వివరాల మారిస్తే.. మిగతా వాటిల్లో ఆటోమేటిక్​గా మారిపోతాయి.

ఎవరు తెరవవచ్చు?

ఎటువంటి ఖర్చు లేకుండా ఎవరైనా ఈ-ఇన్సూరెన్స్ ఖాతాను తెరుచుకోవచ్చు. ఎలాంటి బీమా లేనప్పటికీ ఈ ఖాతాను ప్రారంభించుకోవచ్చు.

భవిష్యత్తులో పాలసీ తీసుకున్నట్లయితే దరఖాస్తు సమయంలో ఈ- ఇన్సూరెన్స్ ఖాతా నంబర్​ను బీమా సంస్థకు అందిస్తే సరిపోతుంది. పాత పాలసీలను కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్​లోకి ఎలాంటి ఛార్జీలు లేకుండా మార్చుకోవచ్చు.

ఈ-ఇన్సూరెన్స్ ఖాతా ప్రారంభించడం ఎలా?

ఈఐఏ సేవలు అందించేందుకు భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ(ఐఆర్​డీఏఐ) నాలుగు సంస్థలకు అనుమతిచ్చింది. అవి..

  1. ఎన్ఎస్​డీఎల్ డేటాబేస్ మేనేజ్మెంట్ లిమిటెడ్
  2. సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ లిమిటెడ్
  3. కార్వీ ఇన్సూరెన్స్ రిపాజిటరీ లిమిటెడ్
  4. క్యామ్స్ రిపాజిటరీ సర్వీసెస్ లిమిడెట్

ఈ నాలుగింటిలో మీకు నచ్చిన సంస్థ వెబ్​సైట్ ద్వారా అకౌంట్​ను తెరుచుకోవచ్చు. కేవైసీ, చిరునామా తదితర వివరాలతో ఆన్​లైన్​లో ఫారమ్ నింపుకోవాలి. అనంతరం లాగిన్ ఐడీ, అకౌంట్ నంబర్ వివరాలు మీకు మెయిల్ లేదా ఫోన్​కు వస్తాయి. కొత్తగా పాలసీ తీసుకునే సమయంలో కూడా ఈఐఏను తీసుకోవచ్చు.

ఖాతా తెరిచేందుకు కావాల్సినవి..

ఈఐఏను తెరిచేందుకు పాస్ పోర్టు సైజ్ ఫోటో, క్యాన్సిల్డ్ చెక్ అందించాల్సి ఉంటుంది. ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డ్​లలో ఏదో ఒకటి వ్యక్తిగత గుర్తింపు కోసం కావాలి. చిరునామా ధ్రువీకరణ కోసం రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డులలో ఏదో ఒకటి సమర్పించాలి. పుట్టిన రోజు ధ్రువీకరణ కోసం రేషన్ కార్డు, పాన్ కార్డు తదితరాల్లో ఒకటి అవసరం అవుతాయి.

పాత పాలసీలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్​లోకి మార్చడం ఎలా?

ఒకసారి ఈఐఏ తెరిస్తే.. పాత ఇన్సూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్​లోకి మార్చుకోవచ్చు. పాలసీని మార్చుకునేందుకు ఉద్దేశించిన ఫారమ్​ను ఈఐఏ సేవలందించే సంస్థ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటుంది. వేరువేరు బీమా సంస్థల పాలసీల మార్పు కోసం వేరువేరు ఫారమ్​లు తీసుకోవాల్సి ఉంటుంది. దగ్గర్లోని బీమా సంస్థ బ్రాంచ్​లో ఆ ఫారమ్​ సమర్పించాలి.

ప్రత్యామ్నాయంగా పాలసీ మార్పు ఫారమ్​ను ఈ-మెయిల్ లేదా కొరియర్ ద్వారా ఈఐఏను అందిస్తున్న సంస్థకు పంపించవచ్చు. పాలసీ మార్పు ఫారమ్​తో పాటు పాలసీ డాక్యుమెంట్లు అందించాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ఫార్మాట్​లోకి మారిన తర్వాత దానికి సంబంధించిన వివరాలు ఫోన్ లేదా మెయిల్ ద్వారా మీకు అందుతాయి.

ఇదీ చూడండి:లైఫ్ సర్టిఫికేట్ ఈజీగా పొందండిలా..

ABOUT THE AUTHOR

...view details