కరోనా వైరస్ విజృంభణతో దేశం నానాటికీ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయి. సరఫరా వ్యవస్థ నిలిచిపోయింది. స్టాక్ మార్కెట్లు భారీ పతనాలు చవిచూశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక అత్యయిక స్థితి విధించాలని పలువురు సూచిస్తున్నారు.
సుప్రీంకోర్టులోనూ ఈ మేరకు పిటిషన్ దాఖలైంది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన కారణంగా అత్యవసర స్థితిని విధించటమే పరిష్కారమని పిటిషన్ వేసిన 'సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ సిస్టమిక్ ఛేంజ్ (సీఏఎస్సీ)' వాదించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 360ని వినియోగించాలని కోరింది.
బిల్లుల రద్దునూ..
వినియోగ బిల్లు వసూళ్లను రద్దు చేయాలని పిటిషన్లో కోరింది సీఏఎస్సీ. విద్యుత్, నీళ్లు, గ్యాస్, టెలిఫోన్, ఇంటర్నెట్, ఈఎంఐ తదితర చెల్లింపులను నిలిపేయాలని సూచించింది. ఈ వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఈ నెల చివర్లో విచారించనుంది.
అయితే ఆర్థిక అత్యయిక స్థితిపై మార్చి మొదటివారంలోనే కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. ఎమర్జెన్సీ విధించే అవసరం లేదని తెలిపారు. ఒకవేళ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సి వస్తే ఏమవుతుంది? అసలేంటి ఈ ఎమర్జెన్సీ? ఆర్టికల్ 360 ఏం చెబుతోంది?
ఎమర్జెన్సీ..
భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో 3 రకాలు ఎమర్జెన్సీలు విధించవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ 360 కల్పిస్తోంది. దీని ప్రకారం ప్రధాని, మంత్రి మండలి సలహాతో రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. దేశ ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వానికి, లేదా దేశంలోని ఏదైనా ప్రాంతానికి చెందిన ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని భావిస్తే.. అధికారిక ప్రకటన ద్వారా రాష్ట్రపతి కూడా దీన్ని అమల్లోకి తేవచ్చు.