ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపడం వల్ల 2020-21 సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతానికి పరిమితమవుతుందని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. ఈ మేరకు 'ఆసియా పసిఫిక్ ఆర్థిక సామాజిక సర్వే 2020: స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వైపు' పేరిట నివేదిక విడుదల చేసింది. అయితే.. 2021-22 సంవత్సరానికి 5.1 శాతం పురోగతి సాధించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న వర్తకం, పర్యటకం, ఆర్థిక సంబంధాల మధ్య కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపుతోందని ఐరాస పేర్కొంది. ఈ పరిస్థితుల మధ్య భారత వృద్ధి రేటు క్షీణిస్తుందని వెల్లడించింది.
"కొవిడ్-19 మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ఇప్పుడే నియంత్రణలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆసియా పసిఫిక్లో ఉన్న ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ముందస్తు అంచనాలతో పోలిస్తే భారత వృద్ధి రేటు క్షీణిస్తుంది."
-ఐరాస నివేదిక