డబ్బు ఉన్న వారిలో చాలా మంది దాన్ని నగదు రూపంలో దాచుకుంటుంటారు. డబ్బు విషయంలో రిస్కు తీసుకునేందుకు ఇష్టపడకకపోవడం ఇందుకు కారణం కావచ్చు. అయితే అలా చేయడం ద్వారా ఉన్న డబ్బు మీద ఎలాంటి ఆదాయం రాకపోగా.. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో దాని విలువ కూడా తగ్గుతూ వస్తుంది.
ఇలా డబ్బు విషయంలో రిస్కు తీసుకునేందుకు ఇష్టపడని వారు.. నగదుకు హామీ ఇచ్చే సురక్షిత సాధనాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. నగదు రూపంలో దాచుకుని పూర్తిగా రాబడి లేకుండా ఉండటం కంటే ఇది చాలా ఉత్తమం.
మరి అలా సురక్షిత రాబడి ఇచ్చే పెట్టుబడి సాధానాలు ఏమిటో ఓ సారి తెలుసుకుందాం.
స్వల్ప కాలిక పెట్టుబడి..
స్వల్ప కాలంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న సాధనాల్లో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే కావాల్సిన వెంటనే నగదు తీసుకునేందుకు వీలుంటుంది. పెట్టుబడి ఉపసంహరణ ప్రక్రియ కూడా చాలా వేగంగా ఉంటుంది. స్వల్ప కాలంలో పెట్టుబడికి సంబంధించి దేశంలో ఎక్కువగా వాడే సాధనాలను పరిశీలిద్దాం.
పొదుపు ఖాతా
పొదుపు ఖాతాకు సంబంధించినంత వరకు వార్షికంగా 3 నుంచి 4 శాతం వరకు రాబడి పొందవచ్చు. పొదుపు ఖాతాలో ఉన్న మొత్తాన్ని అత్యవసర సమయంలో కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. డెబిట్, క్రెడిట్, చెక్ తదితర సదుపాయాల ద్వారా నగదును తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు అధిక వడ్డీని కూడా అందిస్తున్నాయి.
ఫిక్సెడ్ డిపాజిట్లు
స్వల్ప కాలానికి సంబంధించి ఫిక్సెడ్ డిపాజిట్ సులభంగా చేసుకోవచ్చు. ఏడు రోజుల వ్యవధి నుంచి ఫిక్సెడ్ డిపాజిట్ చేయచ్చు. సేవింగ్ ఖాతాలో కంటే ఫిక్సెడ్ డిపాజిట్లో ఎక్కువ వడ్డీ సంపాదించుకోవచ్చు. దీర్ఘకాలం కూడా ఈ పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడికి సంబంధించినంత వరకు ఫిక్సెడ్ డిపాజిట్లు చాలా సురక్షితమైవి. ప్రైవేటు, ప్రభుత్వం రంగ బ్యాంకుల్లో ఈ డిపాజిట్లు తీసుకోవచ్చు.
రికరింగ్ డిపాజిట్లు
పెట్టుబడి విషయంలో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంది. బ్యాంకు ద్వారా కూడా రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా రికరింగ్ డిపాజిట్ ప్రారంభించవచ్చు. డబ్బులు అవసరం ఉన్నప్పుడు రికరింగ్ డిపాజిట్ ఖాతాను మూసివేయవచ్చు. అందులోని మొత్తం పొదుపు ఖాతాలో జమవుతుంది.