బంగాల్లో 7,000 నుంచి 8,000 మంది రైతులు ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ పథకం అమలు చేసేందుకు బంగాల్ ప్రభుత్వం నిరాకరించినప్పటికీ ఈ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయన్నారు తోమర్.
అయితే బంగాల్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు పీఎం-కిసాన్ పథకం లబ్ధిచేకూరదని తోమర్ స్పష్టం చేశారు. సమాఖ్య నిబంధనలను కేంద్రం దాటివేయలేదని పేర్కొన్నారు. లబ్ధిపొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న రైతులను అర్హులుగా ప్రకటించాల్సిన అవసరముందన్నారు. గతంలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని బంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తోమర్ గుర్తు చేశారు.