తెలంగాణ

telangana

ETV Bharat / business

అనవసర ఖర్చులకు కళ్లెం వేద్దామిలా.. - ఆదాయం సరిపోవడం లేదని అనిపిస్తే చేయాల్సిన పనులు

మీ ఆదాయం మీకు సరిపోవడం లేదా? నెలాఖరుకు మీ జేబులు ఖాళీగా ఉంటున్నాయా? మీరు షాపింగ్‌ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఖర్చుపెడుతున్నారన్న భావనలో ఉన్నారా? కొన్ని నెలలుగా ఎక్కువగా ఖర్చు పెడుతున్నామనే యోచనలో ఉన్నారా? వీటిలో ఏ ఒక్కదానికైనా మీ సమాధానం అవును అయితే మీరు ఖర్చు చేసే విధానాన్ని మార్చుకోవాల్సిందే. మరి అందుకు పాటించాల్సిన ఆర్థిక సూత్రలేమిటో ఇప్పుడు చూద్దాం.

how to stop unnecessary spending
అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఎలా

By

Published : Feb 14, 2021, 5:20 PM IST

చేతికి వచ్చే డబ్బు.. అది వెళ్లే తీరును నియంత్రించుకొని లోటుపాట్లను సరిదిద్దుకోవడమే ఆర్థిక ప్రణాళిక ముఖ్యోద్దేశం. జీవితంలో క్లిష్టమైన సవాళ్లను ముందే ఎదుర్కొని ఖర్చులను తగ్గించుకోగలగాలి. ఏ సమయంలోనైనా తగినంత డబ్బు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

నదిలో నీటిలా ప్రవహించే డబ్బు

  • జీతం, వ్యాపారంలో లాభాలు, అద్దె ఆదాయం, బహుమతులు, అనుకోకుండా వచ్చే లాభాలు, వడ్డీ సొమ్ము, డివిడెండ్ల రూపంలో నగదు మన దగ్గరికి ప్రవహిస్తుంది.
  • గృహావసరాలు, రుణాలు, పెట్టుబడులు, పొదుపు, పన్నుల లాంటివి ఉన్నప్పుడు నగదు మన దగ్గర నుంచి బయటకు ప్రవహిస్తుంది.

ఏ సమయంలోనైనా ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే మీ నగదు ప్రవహించే తీరును సమీక్షించుకోవాల్సిందే. ఏయే అవసరాలకు ఎంతెంత ఖర్చు చేస్తున్నామో ఒక ప్రణాళిక రూపొందించుకొని చూసుకుంటే మంచిది. అందుకు తగ్గట్టు మనకు ఆదాయం వస్తుందా లేక ఖర్చులను తగ్గించుకునే ఉపాయం ఉందో లేదో చూసుకోవాలి.

ఆర్థిక ప్రణాళికతో లాభాలు

  • మన చేతిలోని సొమ్మును ఎక్కడ ఎక్కువగా ఖర్చుపెడుతున్నామో తెలుసుకోవడం వల్ల ఆందోళనను తగ్గించుకున్నవాళ్లమవుతాం. మన కుటుంబసభ్యులనో, స్నేహితులనో అప్పు అడగవచ్చు. లేదా మన ఖర్చుల ప్రాథమ్యాలను తెలుసుకోవచ్చు.
  • మన కుటుంబసభ్యులతో ఆర్థిక సంబంధ విషయాలను చర్చించడం ద్వారా మనం వారికి దగ్గర అవుతాం.
  • ఖర్చు చేసే విధానాన్ని ఆర్థిక ప్రణాళిక నేర్పిస్తుంది. ఆర్థిక నియంత్రణను చక్కగా సాధించగలుగుతాం.
  • బాధ్యతలను నెరవేర్చుకునేందుకు తగినంత సొమ్ము మన దగ్గర ఉంటుంది. బ్యాంకు ఖాతాలో తగిన సొమ్ము ఉంచుకోగలుగుతాం.
  • అదనంగా ఉండే ఆదాయాన్ని గుర్తించగలిగి వాటిని ఇతర పెట్టుబడి మార్గాల్లో పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
  • ఆర్థిక క్రమశిక్షణకు దోహదం చేస్తుంది.
  • బాధ్యతలను, అవసరాలను, కోరికలను, సౌఖ్యాలను, విలాసాలను, కలలను, వూహలను ప్రాధాన్యపర్చుకోవడం తెలుస్తుంది. దీర్ఘకాల లాభాలను పొందేందుకు చిన్న చిన్న కోరికలను త్యజించడం నేర్చుకోగలుగుతాం.
  • మన డబ్బు ఎంత త్వరగా వస్తుంది, ఎంత త్వరగా బయటకు వెళ్తుంది అనే విషయాన్ని సమీక్షించుకోగలుగుతాం.
  • మంచి పెట్టుబడి అవకాశాలుంటే దాన్ని సద్వినియోగపర్చుకోగలుగుతాం.
  • చేసిన ఖర్చుల లెక్కలు గనుక ఉంటే భవిష్యత్తులో ఆర్థిక ప్రణాళిక వేసుకునేటప్పుడు వెనక్కి తిరిగి సరిచూసుకోవచ్చు.
  • సమీపంలో ఎదుర్కోబోయే ఆర్థిక కష్టాల గురించి వారిస్తుంది.
  • అత్యవసరాల కోసం దాచుకునే అలవాటును పెంపొందించుకుంటాం.
  • మనం ఎంత వరకు రుణం పొందగలమో తెలసుకునే వీలుంటుంది.
  • పెనాల్టీలు, వడ్డీ రేట్లు, ఆలస్య రుసుములు పడకుండా చూసుకోగలుగుతాం.
  • తక్షణ తృప్తిని అందించే వాటిపై పడకుండా దీర్ఘకాల లాభాలను పొందేందుకు ఆర్థిక లక్ష్యాలను క్రమపద్ధతిలో ఉంచుకోగలుగుతాం.

బడ్జెట్‌ రూపొందించుకోవడంలో మీ పాత అనుభవాలే కీలకం. గత ఆదాయం, ఖర్చులు, పొదుపు, పెట్టుబడులపై మంచి అవగాహన ఉండి చక్కని ప్రణాళిక రూపొందించుకోగలగాలి.

కొంత సొమ్మును మన విలాసాలకు, సంతోషాలకు కూడా ఖర్చుపెడుతుండాలి. మళ్లీ ఈ సమయం, ఈ జీవితం రాదు కదా.

డైటింగ్‌ లాంటిది:

బడ్జెట్‌ అనేది డైటింగ్‌ లాంటిది. వారమంతా పద్ధతైన డైటింగ్‌ పాటించి వారంతంలో ఐస్‌క్రీమ్‌పై మనసు లాగి తింటే వృధా ప్రయాసే కదా.

బడ్జెట్‌ తయారు చేసుకున్నప్పుడు దాన్ని కఠినంగా అమలుపర్చాల్సిందే. చాలా మంది కఠినమైన ప్రణాళికలు వేసుకొని చివరికి ఖరీదైన ఫోన్‌ కొనుగోలు చేసేందుకో, దుస్తులు కొనేందుకో లేదా వారాంతంలో స్నేహితులందరికీ పార్టీ ఇవ్వడానికో ఖర్చు పెట్టేస్తుంటారు. క్షణికంగా తీసుకునే ఈ నిర్ణయాలు మన ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపిస్తుంది.

బడ్జెట్‌ కూడా డైటింగ్‌ లాంటిది. అక్కడ ఎంత క్రమశిక్షణ పాటిస్తామో ఆర్థిక ప్రణాళిక రూపొందించాక అంతే క్రమశిక్షణతో దాన్ని పాటించి తీరాలి.

సరైన లాభాలు పొందేంతవరకు ఓపికతో ఉండాలి. ఆచరించే సమయాన్ని లాభాలు గడించే సమయంతో పోల్చుకొని నిరాశ చెందకండి. మీ కుటుంబసభ్యులను కూడా ఆర్థిక ప్రణాళికలో భాగస్వాములను చేయండి. మీ లక్ష్యాలను, ప్రణాళికలను విశదీకరించి ఖర్చులను ఎందుకు తగ్గించదలచుకున్నారో చెప్తే వాళ్లు మిమ్మల్ని అర్థంచేసుకుంటారు.

ఇదీ చదవండి:తొలి అడుగే క‌ష్టం.. ఆ త‌ర్వాత న‌ల్లేరుపై న‌డ‌కే!

ABOUT THE AUTHOR

...view details