ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వెహికిల్ స్క్రాపేజ్ (వాహనాల తుక్కు) పాలసీని ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లో ఈ పాలసీని ప్రారంభిచారు. దీనితో అభివృద్ధి పరంగా భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుందని పేర్కొన్నారు. కాలుష్య భరిత, కాలం చెల్లిన వాహనాలను తగ్గించుకునేందుకు ఈ పాలసీ ఎంతో కీలకం కానుందని వివరించారు.
వాహనాల తుక్కు కోసం మౌలిక వసతుల ఏర్పాటు విభాగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు.. ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ కీలక విషయాలను వెల్లడించారు. ఈ పాలసీ భారత్ ఆటోమొబిలిటీ, వాహన రంగానికి సరికొత్త గుర్తింపును తీసుకొస్తుందన్నారు. సుస్థిర, పర్యావరణహితమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని వివరించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించేందుకు కూడా ఈ పాలసీ ఉపయోగపడనున్నట్లు తెలిపారు. యువత, అంకుర సంస్థలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని మోదీ పిలుపునిచ్చారు.