కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రికార్డు స్థాయిలో క్షీణించినప్పటికీ.. రెండో అర్ధ భాగంలో మాత్రం బలంగా కోలుకుందని ఆర్థిక శాఖ పేర్కొంది. దీనితో కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్న జీ-20 కూటమిలోని అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నట్లు వెల్లడించింది.
తాజాగా విడుదల చేసిన నెలవారీ(మే నెలకు సంబంధించిన) నివేదికలో ఆర్థిక వ్యవస్థ 2020-21లో స్పష్టంగా V ఆకారపు రికవరీని నమోదు చేసినట్లు పేర్కొంది.
'గత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించింది. అంతకు ముందు జీడీపీ 8 శాతం క్షీణించొచ్చని అంచనాలు వచ్చినప్పటికీ.. V ఆకారపు రికవరీ వల్ల క్షీణత కాస్త తగ్గింది' అని ఆర్థిక శాఖ వివరించింది.
నిజానికి వృద్ధి రేటులో V ఆకారపు రికవరీ ప్రారంభమైనట్లు గత ఏడాది నవంబర్లోనే ప్రకటించింది ఆర్థిక శాఖ. పండుగ సీజన్‌తో పెరిగిన డిమాండ్ ఇందుకు కారణమని తెలిపింది.
అన్‌లాక్‌తో వేగంగా రికవరీ..
కరోనా సంక్షోభం వల్ల 2020-21 తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు రికార్డు స్థాయిలో 24.4 శాతం క్షీణించింది. జీ 20 కూటమిలో అత్యధికంగా క్షీణతను నమోదు చేసిన దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. క్రమంగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రెండో త్రైమాసికంలో క్షీణత 7.3 శాతానికి తగ్గింది.