తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మనకేంటి?

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. భారత్​పై ఈ వివాదం ప్రభావం ప్రస్తుతానికి అంతగా లేనప్పటికీ.. భవిష్యత్తులో సంక్షోభం తప్పదంటున్నారు నిపుణులు. మరి ఆ పరిణామాలేంటి? వాటిని ఎదుర్కొనేందుకు భారత్​కు ఉన్న అవకాశాలేంటి?

వాణిజ్య యుద్ధంతో మనకేంటి?

By

Published : May 17, 2019, 4:42 PM IST

'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్​టీఆర్​ చెప్పిన "బటర్​ఫ్లై థియరీ" గుర్తుందా..? సీతాకోక చిలుక వేగంగా రెక్కలు వాల్చిందంటే... ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో వాతావరణంలో మార్పు ఉంటుందట. అమెరికాకు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఎడ్వర్డ్ లోరెంజ్... కయోస్​ థియరీలో ఈ విషయం చెప్పారు.

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధమూ అలాంటిదే. సుంకాల వివాదం ఆ రెండు దేశాల మధ్యే అయినా... ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై ఉంటుంది. అందుకు భారత్ మినహాయింపు కాదు.

భారత్​పై ప్రభావం...

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం స్వల్ప కాలికంగా భారత్​కు కలిసిరానుంది. రెండు దేశాలు పరస్పరం సుంకాలు పెంచుకుంటున్న కారణంగా ఇరు దేశాలకు బలమైన సరఫరాదారుగా భారత్​ మారనుంది. ఫలితంగా భారత ఎగుమతుల్లో వృద్ధి ఉండనుంది.

రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ధీర్ఘకాలం కొనసాగితే మాత్రం భారత ఈక్విటీ, బాండ్​ మార్కెట్లు సహా ఎక్స్చేంజీ రేట్లపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎందుకంటే చైనా వస్తువులపై.. అమెరికా సుంకాలు పెంచడం వల్ల అగ్రరాజ్యంలో దిగుమతి వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి.

ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరల సూచీని అదుపు చేసేందుకు ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచడం అనివార్యం అవుతుంది.
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే.. ప్రపంచవ్యాప్తగా ప్రభావం ఉంటుంది.

లెక్కలు తారుమారు...

ప్రస్తుతం అమెరికా తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుని భారత్​ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడి పెడుతున్నారు మదుపర్లు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే ఈ పరిస్థితి ఉండదు. భారతీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోతుంది.

ఫెడ్​ వడ్డీ రేట్లు పెరిగితే... డాలర్​ మరింత బలపడుతుంది. పెట్టుబడులకు అమెరికా మంచి గమ్యస్థానం అవుతుంది. అప్పుడు మదుపర్లు భారత్​లాంటి దేశాల్లో ఉన్న పెట్టుబడులను అగ్రరాజ్యానికి తరలిస్తారు. ఈ రూపంలోనూ మనకు నష్టమే.

ఓ వైపు మూలధన పెట్టుబడులు తగ్గడం, మరోవైపు పెట్టుబడుల ఉపసంహరణ పెరగడం వల్ల రూపాయి ఒత్తిడికి లోనవుతుంది. భారత్​ దిగుమతి చేసుకునే వస్తువుల ధర భారీగా పెరుగుతుంది.

నెమ్మదిగా ప్రపంచ మార్కెట్లూ క్షీణించి.. బంగారం ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంటుంది. ఇది భారత్​కు అంత మంచి పరిణామం కాదంటున్నారు నిపుణులు.

సంక్షోభం వస్తే ఏం చేయాలి?

ముఖ్యంగా రెండు అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

ముందుగా తాత్కాలిక ప్రాతిపదికన చైనా-అమెరికాతో సమానంగా ఇతర మార్కెట్లకు ఎగుమతి చేసే సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కింది స్థాయి నుంచి విధానాల రూపకల్పన ద్వారా ఎగుమతుల్లో పోటీతత్వం పెంచాలి.

రెండోది వాణిజ్య యుద్ధ పరిణామాలను సమర్థంగా ఎదుర్కోవడం. ఇందుకోసం ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిని సమతూకం చేస్తూ సమగ్రమైన ద్రవ్యపరపతి విధానం అమలు చేయడం అవసరం.

ABOUT THE AUTHOR

...view details