వ్యవసాయాభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్న తీరుకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేకుండా పోయింది. తాజా బడ్జెట్‌లో 30శాతందాకా నిధులు పెంచినట్లు ప్రకటించారు. కానీ, అందులో 55.80శాతం నిధులు కేవలం 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి'(పీఎం కిసాన్) పథకానికే కేటాయించారు. పంట రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, పంటల బీమా పథకం కూడా కలిపితే ఈ మూడింటికే మొత్తం బడ్జెట్‌లో 83.23 శాతం నిధులు దక్కాయి. వాస్తవానికి ఈ మూడు పథకాల్లో ఏ ఒక్కటీ రైతాంగంలో సగంమందికీ చేరడం లేదు. కొన్ని పథకాలైతే కేవలం నాలుగోవంతు రైతులకే దక్కుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. 2014లో అధికారంలోకి రాగానే 2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. లక్ష్యసాధన గడువుకు మరో రెండేళ్లే మిగిలింది. ఇప్పటికీ ఆదాయం పెరిగిన దాఖలాలు కనిపించడం లేదు. దేశంలో రైతుల ఆదాయం పెంపునకు పలు భారీ పథకాలు ప్రవేశపెట్టినట్లు కేంద్రం తాజాగా పార్లమెంటులో ప్రకటించింది. ఈ పథకాలను పలు రాష్ట్రాల్లో సక్రమంగా అమలు చేయడం లేదు. అమలు చేసే చోట సైతం ప్రభుత్వాల మాటలకు, వాస్తవిక పరిస్థితికి చాలా తేడా ఉంటోంది.
విధానాల్లో లోపం
వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో వ్యవసాయ రంగానికి రూ.1.34 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. ఇందులో పీఎం కిసాన్, పంట రుణాలపై వడ్డీ రాయితీ, పంటల బీమాకు కలిపి మొత్తం రూ.1,11,870 కోట్లు కేటాయించారు. ఇందులో పీఎంకిసాన్ పథకానికి రూ.75 వేల కోట్లు దక్కాయి. వాస్తవానికి ఈ పథకంలో కేవలం 30 శాతంలోపు రైతులకే లబ్ధి చేకూరినట్లు తేలింది. పేద రైతులున్న పశ్చిమ్ బంగ వంటి రాష్ట్రాలు దీన్ని సరిగ్గా అమలు చేయడం లేదు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ.54,370 కోట్లే ఖర్చయినట్లు తేలింది. ఇందులో మిగిలిన రూ.20,630 కోట్లు మిగతా వ్యవసాయాభివృద్ధి పథకాలకూ మళ్లించలేదు. రాష్ట్రాల నిర్లక్ష్యంతో నిధులు మిగిలిపోగా, మరికొన్ని పథకాల్లో కేంద్రం సక్రమంగా విడుదల చేయలేదు. ఉదాహరణకు వ్యవసాయాభివృద్ధికి రాష్ట్రాలకు గ్రాంటు రూపంలో ఈ ఏడాదికి రూ.12,842 కోట్లు గత బడ్జెట్‌లో కేటాయించారు. కానీ, అందులో రూ.3,800 కోట్లు ఇవ్వలేదంటూ అనంతరం ప్రకటించారు. ఇలాంటి కోతల కారణంగా ఈ ఏడాది వ్యవసాయ రంగానికి కేటాయించిన మొత్తం రూ.1.30 లక్షల కోట్లలో చివరికి రూ.28,546 కోట్లు మిగిలిపోయాయి. వీటిని కనీసం రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఇచ్చినా ఏదోఒక రూపంలో రైతులకు అందేవి. వ్యవసాయ బడ్జెట్ పేరిట రైతులకు ఉదారంగా నిధులు బ్యాంకులో జమచేసే పథకాలకే ఎక్కువ కేటాయింపులు చేస్తూ, వాస్తవంగా పంటలపై పరిశోధనలకు, దిగుబడుల పెంపునకు సంబంధించిన వాటిని తగ్గించేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రివాజుగా మారింది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికి గత రెండేళ్లలో కేంద్రం అమలు చేసే వ్యవసాయాభివృద్ధి పథకాలకు సంబంధించి రూ.వెయ్యి కోట్లను విడుదల చేయలేదు. కేంద్రం నుంచి రానందువల్లే రైతులకు ఇవ్వడం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ చెబుతోంది. కానీ, ఆయా పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కలిపి ఇవ్వాల్సినవి విడుదల చేయనందువల్లే నిధుల విడుదల జరగలేదని కేంద్రం వాదిస్తోంది.
రైతులకే నష్టం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనల నడుమ రైతులు నష్టపోతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఏటా రూ.వేల కోట్లు రైతులకు బడ్జెట్ కాగితాల్లోనే తప్ప వాస్తవానికి ఇవ్వడమే లేదు. వచ్చే ఏడాది అదనంగా 37.50 లక్షల ఎకరాల్లో రైతులను ఇతర పంటల నుంచి ఆహార ధాన్యాలు సాగుచేసేలా మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల 44 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా పండించడం సాధ్యమవుతుందని అంచనా. హెక్టారుకు 27 క్వింటాళ్ల చొప్పున బియ్యం ఉత్పాదకత సాధించాలనే లక్ష్యాన్ని కూడా కేంద్ర బడ్జెట్‌లో తాజాగా ప్రకటించారు. ఈ ఏడాదే తెలంగాణలో సగటు 34 క్వింటాళ్లకు పైగా ఉత్పాదకత వచ్చింది. కేంద్రం నిర్ణయించిన లక్ష్యం అంతకన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ఎరువులపై ఇచ్చే రాయితీని రూ.79,998 కోట్ల నుంచి రూ.71,309 కోట్లకు తగ్గించారు. ఎరువుల్లో యూరియాకు ఇచ్చే రాయితీ 67 శాతానికి పైగా ఉంటోంది. యూరియా ధరల నియంత్రణ ఒక్కటే కేంద్రం చేతిలో ఉంది. మిగతా ఎరువుల ధరలను నిర్ణయించే అధికారం వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలకే ఉన్నందు వల్ల వాటికిచ్చే రాయితీ తక్కువగా కేటాయిస్తోంది.
వడ్డీ రాయితీ