‘కరోనా’ ప్రభావం నుంచి బ్యాంకింగ్ రంగం ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి కోలుకుంటుందని అంచనా వేస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) హైదరాబాద్ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ కె. భాస్కరరావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాల విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈ, రిటైల్ విభాగాలకు అండగా నిలవటానికి తమ బ్యాంకు కృషి చేస్తోందని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, పథకాల ప్రకారం అధికంగా రుణాలు ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు యూబీఐలో విలీనం కావటం, సంస్థాగత నిర్మాణంలో మార్పులు-చేర్పుల ఫలితంగా యూబీఐ హైదరాబాద్ జోన్ పరిధిలోకి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చారు. ఈ జోన్ పరిధిలో ఇప్పుడు 734 శాఖలు ఉన్నాయి. దీనికి సీజీఎంగా బాధ్యతలు చేపట్టిన భాస్కరరావు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాలు, వ్యాపార ప్రణాళికను వివరించారు.
విలీనంతో మేలే...
మూడు బ్యాంకుల విలీనం వల్ల ఎంతో మేలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘మా బ్యాలెన్స్ షీట్ పెద్దదైంది. దీనివల్ల గతంలో 11 శాతం వడ్డీరేటుకు అప్పులు ఇచ్చే స్థితి నుంచి ఇప్పుడు 9 శాతానికి అప్పులు ఇవ్వగలుగుతున్నాం’ అన్నారాయన. అంతేగాక శాఖల సంఖ్య పెరిగి ప్రజలకు బాగా దగ్గరైనట్లు తెలిపారు. ఇప్పుడు యూబీఐ దేశవ్యాప్తంగా 9,500 శాఖలతో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఉందన్నారు. విలీనం వల్ల ఒకే చోట రెండు మూడు శాఖలు ఉండే పరిస్థితి తలెత్తుతుంది. అందువల్ల కొన్నింటిని విలీనం చేసి, ఇతర ప్రదేశాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేస్తామని వివరించారు. అందువల్ల బ్యాంకుల శాఖల సంఖ్య తగ్గే అవకాశం లేదన్నారు.