తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఓడిపోయే యుద్ధంలో ట్రంప్​ ఎంత పోరాడినా వ్యర్థం' - ఎగుమతులు

అగ్రరాజ్యం తమ ఉత్పత్తులపై సుంకాలు పెంచితే, దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన చైనా అన్నంత పనీ చేసింది. అమెరికా ఉత్పత్తులపై 60 బిలియన్​ డాలర్ల సుంకాలు విధించింది. ఈ వాణిజ్యయుద్ధం వల్ల అమెరికాకే తీవ్ర నష్టం వాటిల్లనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

'ఓడిపోయే యుద్ధంలో ట్రంప్​ ఎంత పోరాడినా వ్యర్థం'

By

Published : May 15, 2019, 5:50 AM IST

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అగ్రరాజ్యం తమ ఉత్పత్తులపై సుంకాలు పెంచినదానికి బదులుగా... చైనా కూడా తాజాగా అమెరికా దిగుమతులపై సుమారు 60 బిలియన్​ డాలర్ల సుంకాలు విధించింది. ఇది వాణిజ్య యుద్ధంలో ట్రంప్​ ఓటమికి దారితీస్తున్నట్లు కనిపిస్తోంది.

చైనాతో వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే వేళ హఠాత్తుగా, అమెరికా అధ్యక్షుడు సుమారు 200 బిలియన్​ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై పన్నులు పెంచారు. ఈ పన్నులనూ ఒకేసారి 10 శాతం నుంచి 25 శాతానికి పెంచడం గమనార్హం. మిగతా చైనా దిగుమతులపైనా సుమారు 300 బిలియన్​ డాలర్ల మేర పన్నులు విధించాలని అధికారులను ఆదేశించారు.

అగ్రరాజ్యం తమ ఉత్పత్తులపై సుంకాలు పెంచితే, దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన చైనా అన్నంతపనీ చేసింది. అమెరికా దిగుమతులపై తాజాగా సుమారు 60 బిలియన్​ డాలర్ల సుంకాలు విధించింది.

చైనా వల్లే.. వాణిజ్యలోటు?

ట్రంప్​, అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ తన ప్రచారాస్త్రంగా 'అమెరికా వాణిజ్యలోటు' గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. చైనా దిగుమతుల వల్లే అమెరికా తీవ్రంగా నష్టపోతోందని ఆరోపించారు. ఈ విషయం ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. చైనా తదితర దేశాల తప్పుడు వాణిజ్య విధానాలు, చౌక కార్మిక శక్తి మొదలైన కారణాలే తమ దేశ నిరుద్యోగానికి కారణమని అమెరికా ప్రజలు భావించారు. ఇది ట్రంప్​ విజయానికి సోపానమైంది.

అయితే ట్రంప్​ చెబుతున్న 'అమెరికా వాణిజ్యలోటు' అనేది ఓ భ్రమ అన్నది వాస్తవం.

లోటు అనేది ఓ భ్రమ..

వాస్తవానికి ట్రంప్, అతని బృందం చెబుతున్న వాణిజ్యలోటు గణాంకాలు ఓ మాయ. ఇదే విషయాన్ని ప్రముఖ ఆర్థికవేత్త పాల్ ​క్రుగ్​మన్​... న్యూయార్క్​ టైమ్స్​ సంపాదకీయంలో రాశారు.

నిజానికి అమెరికా వాణిజ్యలోటుకు ప్రధాన కారణం చైనా ఉత్పత్తులు మాత్రమే కావు. చైనాలో తయారయ్యేవి ఆ దేశానికే చెందినవిగా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చైనా అనేది ఓ పెద్ద 'అసెంబ్లింగ్ హబ్​'. వివిధ దేశాల నుంచి వచ్చే మధ్యంతర ఉత్పత్తులను, అలాగే విడిభాగాలను అక్కడ అసెంబ్లింగ్​ చేస్తారు. ఎందుకంటే చైనాలో కార్మిక వేతనాలు తక్కువగా ఉండటం, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు ఉండటమే.

దీని ప్రకారం అర్థం అయ్యేది ఏమిటంటే, చైనాలో తయారయ్యే అంతిమ ఉత్పత్తుల వల్ల ఆ దేశానికి వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఉదాహరణకు యాపిల్​ ఫోన్​ను చైనాలో అసెంబుల్​ చేస్తారు. అందులో డ్రాగన్​కు వచ్చే ఆదాయం కేవలం 4 శాతం మాత్రమే. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ట్రంప్​ చెప్పే 'వాణిజ్యలోటు' అనే అంశం పెద్ద భ్రమ అని తేలిపోతుంది. ఈ భ్రమలో ఉండే ట్రంప్​ ఓడిపోయే వాణిజ్య యుద్ధం చేస్తున్నారు.

ఓడిపోయే యుద్ధం కోసం పోరాటం...

ఇటీవలే ప్రిన్స్​టన్​, కొలంబియా, న్యూయార్క్​ ఫెడరల్​ రిజర్వ్​ ఆర్థికవేత్తలు ఓ పరిశోధనా పత్రాన్ని విడుదల చేశారు. ఇది అమెరికాలో ధరలు, సంక్షేమంపై 2018 వాణిజ్య యుద్ధం ప్రభావాన్ని అధ్యయనం చేసింది.

గత ఏడాది ట్రంప్​ ప్రభుత్వం సుంకాలు పెంచడం మూలంగా ధరలు పెరిగి, అమెరికా వినియోగదారులు నష్టపోయారని ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా వాణిజ్యయుద్ధం వల్ల గతేడాది అమెరికా నికర సంక్షేమ నష్టం నెలకు 1.4 బిలియన్​ డాలర్లు. సంవత్సరానికి 17 బిలియన్​ డాలర్లు. ఇది అమెరికా జీడీపీలో సుమారు 0.1 శాతానికి సమానం.

ప్రతీకారానికి చైనా సిద్ధం..!

మరోవైపు, అమెరికా ఎగుమతి ఆధారిత పరిశ్రమల వల్ల, తమ దేశంలోనూ నిరుద్యోగ సమస్య ఏర్పడుతోందని చైనా గ్రహించింది. ఈ కారణంగా చైనా ప్రతీకార చర్యలకు దిగితే, అది అమెరికా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వైమానిక రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అలాగే చైనాలో ఉన్న అమెరికాకు చెందిన బహుళ జాతీయ సంస్థలపై జిన్​పింగ్ ప్రభుత్వం నేరుగా​ ఆంక్షలు విధించవచ్చు.

యువాన్​ విలువ తగ్గిస్తే...

వీటన్నింటికి మించి డాలర్​ని కాదని... చైనా తన కరెన్సీ 'యువాన్​' విలువను తగ్గించవచ్చు. అప్పుడు అంతర్జాతీయ విపణిలో చైనా ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. అది అమెరికాకే ఎదురుదెబ్బ. ఇలా జరగాలని ట్రంప్​ కలలో కూడా కోరుకోరు. నిజం ఇలా ఉంటే.. ట్రంప్ మాత్రం చైనాతో వాణిజ్య యుద్ధంలో తానే గెలుస్తానని భ్రమలో ఉండడం విడ్డూరం. అయితే యుద్ధమే వస్తే విజేతలు ఎవరూ ఉండరన్న చరిత్ర పాఠాన్నీ ట్రంప్​ మరచినట్టు ఉన్నారు.

చరిత్ర మరిచిపోవద్దు...

'1930 గొప్ప ఆర్థికమాంద్యం' సమయంలో అమెరికా తన వాణిజ్యాన్ని రక్షించుకోవడం కోసం భారీగా పన్నులు పెంచింది. ఫలితంగా మిగతా ప్రపంచదేశాలు ప్రతీకార చర్యలకు దిగాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపింది. అదే తప్పు ఇప్పుడు పునరావృతమైతే, పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయి. ప్రపంచీకరణ తరువాత అన్ని దేశాల ఆర్థికవ్యవస్థలు అనుసంధానమవడమే ఇందుకు కారణం.

ఈ నేపథ్యంలో ట్రంప్​ తన వాణిజ్య విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చైనా లాంటి బలమైన ఆర్థిక శక్తితో పోటీపడటం వల్ల అది అమెరికాకే నష్టం చేకూరుస్తుంది. ఈ వాణిజ్యపోరులో ట్రంప్​ ఓటమిని ఎదుర్కోకతప్పదన్నది ఆర్థికవేత్తల మాట.

ఇదీ చూడండి: మీ వాట్సాప్​ హ్యాకైందా? చెక్​ చేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details