వివిధ అంతర్జాతీయ వేదికలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమైనప్పుడు పరస్పరం ప్రశంసించుకోవడం గతంలో అనేక సందర్భాల్లో చూశాం. ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య పెనవేసుకుంటున్న బలమైన అనుబంధానికి ఇది ఓ నిదర్శనం.
భారత్‌లో రెండురోజుల ట్రంప్ పర్యటన ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. అదే సమయంలో రక్షణ, అంతరిక్షం సహా పలు రంగాల్లో కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఏటా 12 వేలకోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది.
కీలక ఒప్పందాలేంటి..?
డొనాల్డ్ ట్రంప్ ఒక దేశాధ్యక్షుడు మాత్రమే కాదు... స్వయంగా అతిపెద్ద వ్యాపార వేత్త. భారత్‌లో ఆయన భారీ పెట్టుబడులు పెట్టారు. అందుకే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, మేధో సంపత్తి హక్కులు వంటి కొన్ని అంశాలను మినహాయిస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యానుబంధం చెప్పుకోదగిన విధంగానే ఉంది.
ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ... ట్రంప్ పర్యటన సందర్భంగా భారత్-అమెరికా ఇంకెలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటాయన్నదే అసలు ప్రశ్న.
- ఇదీ చూడండి:దిల్లీ బడిలో మెలానియాకు 'సంతోషాల పాఠాలు'
రక్షణ కొనుగోళ్లకు సై
ఆకాశ మార్గంలో శత్రువులు చేసే దాడులను తిప్పికొట్టడంలో దోహదపడగల 'సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఐఏడీడబ్ల్యూఎస్)'ను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఇటీవలే సమ్మతించింది. 186 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందానికి సంబంధించిన దస్త్రాలపై ట్రంప్ పర్యటనలో ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశాలున్నాయి.
అమెరికా సంస్థ 'లాక్‌హీడ్ మార్టిన్' నుంచి నౌకాదళం కోసం 24 బహుళ ప్రయోజనకర 'ఎంహెచ్-60ఆర్' సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశముంది. ఈ ఒప్పందం విలువ సుమారు 260 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా.