ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ భేటీ కానున్నారు. కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో రుణ చెల్లింపులపై బ్యాంకులు విధించిన 3 నెలల మారటోరియం సహా దీర్ఘకాలిక రుణాల పురోగతిని సమీక్షించనున్నారు.
రుణ వితరణపై సూచనలు..
ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై చిన్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు రుణ వితరణపై పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకర్లతో సమావేశమవుతున్న నిర్మలా సీతారామన్.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) ఆర్థిక పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ ఆర్థిక సంస్థలు ఎంఎస్ఎంఈలకు ప్రధాన రుణ దాతలుగా ఉన్నాయి.