దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమైంది. కొనుగోళ్ల సందడీ షురూ అయ్యింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ఇప్పటికే పలు సంస్థలు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. పైగా కరోనా ఆంక్షలతో ఇప్పటి వరకు షాపింగ్‌కు దూరంగా ఉన్నవారంతా ఈ పండుగ సీజన్‌ను ఓ అవకాశంగా భావిస్తున్నారు. పండుగ సీజన్‌లో షాపింగ్‌కు కాస్త ఎక్కువే ఖర్చు చేద్దామనుకుంటున్నామని 42 శాతం కుటుంబాలు 'యాక్సిస్ మై ఇండియా' ఇటీవల జరిపిన సర్వేలో తెలిపాయి. అయితే, నిపుణులు మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిందేనని సూచిస్తున్నారు. ముందూ వెనకా ఆలోచించకుండా, ఎడాపెడా ఖర్చు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. లేదంటే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తప్పవంటున్నారు. మరి ఈ పండుగ సీజన్‌లో బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో చూద్దాం..!
బడ్జెట్ ప్లాన్ వేసుకోండి..
బడ్జెట్‌ను రూపొందించుకొని దానికి కట్టుబడి ఉండండి. ఎట్టిపరిస్థితుల్లో ఈ నియమాన్ని అతిక్రమించవద్దు. బడ్జెట్ కూడా మీ స్తోమతకు తగ్గట్లే ఉండాలి. వాస్తవికతకు దూరంగా ఉంటే ఉపయోగం శూన్యం. లేదంటే ఎక్కువ ఖర్చు చేసి తర్వాత ఇబ్బందుల్లో పడక తప్పదు.
చెల్లింపు మాధ్యమాలను వినియోగించుకోండి..
పండుగ సీజన్ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు అనేక సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. వాటిని వినియోగించుకోండి. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డులపైనా ప్రత్యేక డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉంటాయి. వాటిని సాధ్యమైనంత వరకు వినియోగించుకుంటే ఖర్చు కలిసొస్తుంది. ఏ మాధ్యమం ద్వారా చెల్లింపు చేస్తే మీకు ఎక్కువ ఆదా అవుతుందో దాన్నే వినియోగించండి. అయితే, ప్రతి ఆఫర్‌కు షరతులు వర్తిస్తాయి కదా! అందుకే జాగ్రత్తగా ప్రతి నియమాన్ని చదవండి. కేవలం ఆఫర్ కోసమని ఎక్కువ ఖర్చు చేస్తే మళ్లీ ఇరకాటంలో పడతారు. అలాగే వివిధ సంస్థలు అందిస్తున్న ఆఫర్లను సరిపోల్చుకోండి.
అవసరమైనవాటికి తొలి ప్రాధాన్యం..