తెలంగాణ

telangana

'డబ్బులు ముద్రించి పంచాల్సిన సమయమిది!'

By

Published : May 27, 2021, 6:45 PM IST

కరోనా రెండో దశ సృష్టిస్తున్న సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దీపన చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు సీఐఐ అధ్యక్షుడు ఉదయ్​ కోటక్. కరెన్సీని అధికంగా ముద్రించడం, ఆర్థిక ప్యాకేజీ, చిన్న సంస్థలకు రుణ సదుపాయం పెంచడం వంటివి పరిశీలించాలని కేంద్రానికి సూచించారు.

Uday Kotak on Economic Package
ఆర్థిక ప్యాకేజీ అవసరమన్న ఉదయ్​ కోటక్

కరోనా రెండో దశ నేపథ్యంలో విధించిన ఆంక్షల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు, కోటక్​ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్. ఇలాంటి పరిస్థితుల్లో కరెన్సీని ఎక్కువగా ముద్రించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వానికి రిజర్వ్​ బ్యాంక్ (ఆర్​బీఐ) పూర్తిగా సహకరించాలన్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు పేర్కొన్నారు ఉదయ్ కోటక్.

ఉదయ్​ కోటక్, సీఐఐ అధ్యక్షుడు, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు

"నా అంచనా ప్రకారం.. ప్రభుత్వ బ్యాలెన్స్​ షీట్​ను విస్తరించాల్సిన సమయం వచ్చింది. ద్రవ్య విధానం పరిధిని విస్తరించడం లేదా కరెన్సీని ఎక్కువగా ముద్రించేందుకు ఆర్​బీఐ కూడా ప్రభుత్వానికి సహకరించాలి. ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?"

- ఉదయ్​ కోటక్​

ప్యాకేజీ కూడా అవసరం..

మరో ఇంటర్వ్యూలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక ప్యాకేజీ అవసరం అని కూడా ఉదయ్​ కోటక్ అభిప్రాయపడ్డారు. చిన్న తరహా వ్యాపారాలకు ఇచ్చే క్రెడిట్​ గ్యారంటీ రుణాల పరిమితిని రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించాలన్నారు.

'ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అల్పాదాయ వర్గాలు, చిన్న, మధ్య తరగతి వ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ద్వారా సహాయం అందివ్వాలని బలంగా సూచిస్తున్నా. ఆ సహాయం నేరుగా నగదు రూపంలో గానీ, ఆహారం, ఇతర విధాలుగా కూడా ఉండొచ్చ'ని ప్రభుత్వానికి సూచించారు ఉదయ్​ కోటక్.

వృద్ధి రేటు అంచనాలు తారుమారు..

కరోనా రెండో దశ విధ్వంసకరంగా మారుతున్నట్లు ఉదయ్​ కోటక్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వివరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు 10 శాతం కన్నా తక్కువగా నమోదవ్వచ్చన్నారు ఉదయ్​ కోటక్. అయితే ఇంకా ప్రస్తుత పరిస్థితులను సమీక్షించాల్సి ఉందని తెలిపారు. కొవిడ్ వల్ల 2020-21లో ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణించిందని.. దీనికి తోడు ఈ ఏడాది ఆరంభంలో కాస్త సానుకూల పరిస్థితులు ఉన్నందున 11 శాతం వృద్ధి రేటును అంచనా వేసినట్లు వివరించారు.

2020లో ప్రభుత్వ ఉద్దీపన ఇలా..

గత ఏడాది కేంద్రం దాదాపు రూ.27.1 లక్షల కోట్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఇది దేశ జీడీపీలో దాదాపు 13 శాతానికి సమానం. ఆర్​బీఐ ఇచ్చిన ఉద్దీపనతో కలిపితే ఈ మొత్తం దాదాపు రూ.30 లక్షల కోట్లుగా అంచనా.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details