తెలంగాణ

telangana

ETV Bharat / business

మౌలిక సమస్యలు అధిగమిస్తేనే ఆర్థిక రంగం పరుగులు - the key infrastructure developments is necessary for india's economy rapid development

భారత్​ దిగ్గజ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి అవసరం. ఇందుకోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సరైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లోని మౌలిక వసతుల్లో దేశ ప్రస్తుత స్థితి, తీసుకోవాల్సిన నిర్ణయాలపై విశ్లేషణాత్మక కథనం.

edit
మౌలిక సమస్యలు అధిగమిస్తేనే ఆర్థిక రంగం పరుగులు

By

Published : Jan 2, 2020, 8:10 AM IST

Updated : Jan 2, 2020, 12:01 PM IST

వచ్చే అయిదేళ్లలో భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరింపజేసే క్రమంలో మౌలిక వసతుల రంగాన నూరు లక్షల కోట్ల రూపాయల దాకా వెచ్చిస్తామన్నది మోదీ ప్రభుత్వం గతంలో జాతికిచ్చిన హామీ. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రబొర్తి సారథ్యంలో సీనియర్‌ బ్యురాక్రాట్లతో కూడిన కార్యదళం- 18 రాష్ట్రాల్లో రూ.102 లక్షల కోట్లతో పట్టాలకు ఎక్కించాల్సిన పథకాల్ని తాజాగా క్రోడీకరించింది. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా వెలుగుచూసిన మౌలిక అజెండాకు ఆ కార్యదళం సిఫార్సులే ప్రాతిపదిక. ఆర్థిక, సామాజిక శ్రేణులుగా విభజించిన మౌలిక ప్రాజెక్టుల్లో విద్యుత్‌ సహా ఇంధన రంగానికి 24 శాతం, రహదారులకు 19 శాతం, పట్టణాభివృద్ధికి 16 శాతం, రైల్వేలకు 13 శాతం ప్రత్యేకించారు. గ్రామీణ మౌలిక వసతులకు ఎనిమిది శాతం; ఆరోగ్యం, విద్య, తాగునీరు తదితరాల సామాజిక పద్దుకు మూడు శాతం కేటాయించామంటున్నారు. ఇవన్నీ యథాతథంగా కార్యాచరణకు నోచుకుంటే ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్న అంచనాల్లో అతిశయోక్తి ఏమీ లేదు. మూలధన వ్యయీకరణలో ఎవరు ఎంత భారం తలకెత్తుకుంటారన్న లెక్కలపైనే శంకలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలు చెరో 39 శాతం, ప్రైవేటు సంస్థలు తక్కిన 22 శాతం వ్యయభారం మోస్తే అనుకున్న లక్ష్యం సజావుగా నెరవేరుతుందన్నది కేంద్ర విత్తమంత్రి ఆవిష్కరిస్తున్న సుందర దృశ్యం. ఆ లెక్కన, మొత్తం అంచనా వ్యయంలో రమారమి 40 లక్షల కోట్ల రూపాయల మేర రాష్ట్రాలు సొంతంగా నిభాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే కాసుల కటకటతో కిందుమీదులవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు అది నిస్సంశయంగా తలకుమించిన భారమేనన్నది నిర్వివాదం. మాంద్యానికి మౌలిక చికిత్స వినసొంపుగానే ఉన్నా, ఏ మేరకది సాకారమవుతుందన్నదే గడ్డు ప్రశ్న.

మాంద్యం దుష్ప్రభావాలకు అద్దంపడుతోంది

దేశార్థిక వికాసానికి అత్యంత కీలకమైన ఎనిమిది పారిశ్రామిక విభాగాలు వరసగా నాలుగో నెలా ఆందోళనకర ఫలితాలతో దిగులు పుట్టిస్తున్నాయి. బొగ్గు, ముడిచమురు, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్‌ రంగాల్లో వృద్ధి కుంచించుకుపోవడం మాంద్యం తాలూకు దుష్ప్రభావాలకు అద్దంపడుతోంది. సిమెంటు ఉత్పత్తిలో వృద్ధి నవంబరులో సగానికి పడిపోయింది. కొత్తగా రహదారులు, నౌకాశ్రయాలు, విద్యుత్‌-నీటిపారుదల వసతుల నిర్మాణం జోరందుకుంటే సిమెంటు, ఉక్కు రంగాలకు గొప్ప ఊపొస్తుందన్నది ఆశావహమైన అంచనా. బృహత్తర చొరవతో భూరి సత్ఫలితాలు సుసాధ్యం కానున్నాయన్న అధికారిక కథనాలకు, నిపుణులు లేవనెత్తుతున్న అభ్యంతరాలకు లంగరందడం లేదు. కేంద్రం తనవంతుగా అయిదేళ్లలో వెచ్చిస్తామంటున్న దాదాపు నలభై లక్షల కోట్ల రూపాయల రాశి ఇప్పటికే చేస్తున్న వ్యయంతో పోలిస్తే ఏమంత అధికం కాదంటున్న విశ్లేషణల్ని తేలిగ్గా కొట్టిపారేసే వీల్లేదు. పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో మౌలిక సదుపాయాల రంగానికి సుమారు రూ.52 లక్షల కోట్లు అవసరమని, అందులో 47 శాతం మేర ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రాబట్టాల్సి ఉంటుందని ఏడేళ్ల క్రితం దీపక్‌ పరేఖ్‌ కమిటీ సూచించింది. విస్తృత స్థాయి నిధులు కూడగట్టడంలో బ్యాంకులదే ప్రధాన పాత్రగా అసోచామ్‌, క్రిసిల్‌ సంస్థల సంయుక్త శ్వేతపత్రం నాలుగేళ్లనాడు అభివర్ణించింది. మొండి బాకీల బరువు కింద బ్యాంకులు సతమతమవుతున్న నేపథ్యంలో, అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఎంతో మారిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది మాసాల్లో పరిశ్రమలకు బ్యాంకు రుణాలు 3.9 శాతం మేర కుంగిపోయాయి. అనుమతుల్లో ఎనలేని జాప్యం కారణంగా మౌలిక వసతుల ప్రాజెక్టులు నిలిచిపోయే దుర్గతిని చెదరగొట్టకుండా, నవ సంకల్పం నెరవేరుతుందని కేంద్రం ఎలా ధీమా వ్యక్తీకరించగలుగుతుంది?

అసలు దేశంపై మాంద్యం తాలూకు దుష్ప్రభావం మంచుదుప్పటిలా పరచుకోవడానికి కారణాలే- క్షీణించిన విద్యుదుత్పత్తి, మందగించిన రుణ లభ్యత, రైతుకు కరవైన గిట్టుబాటు. సమర్థ విధాన నిర్ణయాలు కొరవడి ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు చతికిలపడి- కడకు రెవిన్యూ అంచనాలు, రాష్ట్రాల బడ్జెట్‌ లెక్కలూ కిందుమీదులయ్యే దురవస్థ దాపురించింది. ఇందుకు విరుగుడుగా మౌలిక అజెండా అక్కరకొస్తుందని తలపోస్తున్న కేంద్రం, వాస్తవిక స్థితిగతుల్ని ఏమాత్రం ఉపేక్షించే వీల్లేదు. అయిదేళ్ల క్రితం వ్యాపార అనుకూలత సూచీలో 142వ స్థానానికి పరిమితమైన ఇండియా ఇటీవల 63కు చేరినా- ఒప్పందాల అమలులో 163, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో 154 ర్యాంకులతో దిమ్మెరపరుస్తోంది. అందుకు ప్రధానంగా తప్పుపట్టాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకాలనేనని ఆర్థికమంత్రి సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ మొన్నీమధ్య స్పష్టీకరించారు. వివిధ ఒడంబడికలకు కట్టుబడటంలో ప్రభుత్వాల దివాలాకోరుతనాన్ని నిపుణులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ మౌలిక సదుపాయాల సూచీ 2019 ప్రకారం- విమానాశ్రయాల పద్దులో మనకన్నా మలేసియా మెరుగు. చైనా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా తదితరాలతో పోలిస్తే ఇక్కడి రహదారుల ముఖచిత్రం వెలాతెలాపోతోంది. వరదల నివారణ విధివిధానాల రీత్యా చైనా, సౌదీ, జర్మనీ వంటి దేశాలకన్నా ఇండియా చాలా వెనకబడి ఉంది. డెన్మార్క్‌, న్యూజిలాండ్‌, సింగపూర్‌, హాంకాంగ్‌లు నిపుణ మానవ వనరుల బలిమితో వెలుపలి పెట్టుబడిదారుల్ని సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి. అటువంటి అనుభవాల నుంచి విలువైన గుణపాఠాలు నేర్చి, మౌలిక రంగాన్ని పటిష్ఠీకరిస్తూ వాణిజ్య ప్రతిబంధకాల్ని రూపుమాపితేనే- ఇక్కడికీ పెట్టుబడిదారులు బారులు తీరి ఆర్థిక దిగ్గజశక్తిగా భారత్‌ ఎదగగలుగుతుంది!

ఇదీ చూడండి: నోయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్​ రాట్నం

Last Updated : Jan 2, 2020, 12:01 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details