ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొన్ని రోజుల్లో ముగియనుంది. ఇప్పటికీ పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టని వారు.. మార్చి 31లోగా ఆ ప్రక్రియను ముగించాలి. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే వారు ఏ పథకాలను ఎంచుకోవాలనే సందేహంలో ఉంటారు. ఒకవైపు మార్కెట్‌లో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ.. మరోవైపు పన్ను ఆదాకు ఉపయోపగపడే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్)కు ఇప్పుడు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యువతకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు.
ఎందుకు?
సెక్షన్ 80సీలో భాగంగా రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో మదుపు చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్లలోని ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో చేసిన మదుపునూ ఇందులో చూపించుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేసే వారు.. తమ పన్ను ప్రణాళికలో భాగంగా వీటిని ఎంచుకోవచ్చు.
రాబడి విషయంలో..
పెట్టుబడులకు సరైన ప్రతిఫలం ఉండాలని కోరుకుంటారందరూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సురక్షిత పథకాల నుంచి కనీసం 12-15శాతం రాబడి రావడం ఆశించలేం. చరిత్రను పరిశీలిస్తే.. ఈఎల్‌ఎస్‌ఎస్‌లు మంచి రాబడినే అందించాయి. అందుకే, చివరి నిమిషంలో పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారు.. వీటిని పరిశీలించవచ్చు.