తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశార్థికానికి బొగ్గే ఇంధనం - coal india editorial

కోల్‌ ఇండియా లిమిటెడ్‌ గుత్తాధిపత్యాన్ని తోసిరాజంటూ వాణిజ్య అవసరాల నిమిత్తం బొగ్గు తవ్వుకోవడానికి రెండేళ్లనాడు ప్రైవేటు సంస్థల్ని అనుమతించిన కేంద్రం...భారీ సంస్కరణలు చేసింది. 2018 ఫిబ్రవరినాటి చొరవతో బొగ్గు రంగంలో పోటీ నెలకొని ధరలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశావహ అంచనాలు వేసినా, నిబంధనల చిక్కుముళ్లు వీడలేదు.

కోల్‌ ఇండియా లిమిటెడ్‌
దేశార్థికానికి బొగ్గే ఇంధనం

By

Published : Jan 11, 2020, 8:38 AM IST

కోల్‌ ఇండియా లిమిటెడ్‌ గుత్తాధిపత్యాన్ని తోసిరాజంటూ వాణిజ్య అవసరాల నిమిత్తం బొగ్గు తవ్వుకోవడానికి రెండేళ్లనాడు ప్రైవేటు సంస్థల్ని అనుమతించిన కేంద్రప్రభుత్వం- ఆ క్రమంలో భారీ సంస్కరణకు తాజాగా తెరతీసింది. 1957నాటి గనులు ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టాన్ని, 2015నాటి బొగ్గుగనుల చట్టాన్ని సవరిస్తూ ఖనిజ శాసనాల అత్యవసరాదేశం (ఆర్డినెన్స్‌) జారీకి కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. 2018 ఫిబ్రవరినాటి చొరవతో బొగ్గు రంగంలో పోటీ నెలకొని ధరలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశావహ అంచనాలు వేసినా, నిబంధనల చిక్కుముళ్లు వీడలేదు. వేలంపాటలో పోటీదారుల సంఖ్య ఇతోధికం కావాలన్నా, గనుల తవ్వకాల్లో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు నిరుడు ఆగస్టులో మార్గం సుగమం చేసినప్పటి ప్రవచిత లక్ష్యం నెరవేరాలన్నా- శాసనపరమైన ప్రతిబంధకాలు తొలగాల్సిందే.

అంతరం విస్తరించింది..

ఇంతవరకు విద్యుత్తు, ఉక్కువంటి రంగాలకు చెందినవారిని, అదీ భారత్‌లో బొగ్గుగనుల తవ్వకంలో అనుభవం కలిగిఉంటేనే వేలంపాటలో పాల్గోవడానికి అనుమతించేవారు. ఆ షరతులపై ఆర్డినెన్స్‌ వేటు పుణ్యమా అని పీబాడీ, గ్లెన్‌కోర్‌, రియో టింటో వంటి దిగ్గజ అంతర్జాతీయ సంస్థల ఆగమనానికి బాటలు పడనున్నాయంటున్నారు. సిమెంటు, ఉక్కు, విద్యుత్‌ పరిశ్రమల అవసరాలకు బొగ్గు సరఫరాలు నిరంతరాయంగా అందుతుండాలి. గిరాకీ సరఫరాల మధ్య అంతరం విస్తరించి భారత్‌ గత ఏడాది 23 కోట్ల టన్నులకుపైగా బొగ్గును విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అందులో 13 కోట్ల టన్నుల మేర దేశీయ నిల్వలనుంచి సమకూర్చుకోగలిగి ఉంటే ఖజానాకు భారీగా ఆదా అయ్యుండేది. నూతన సంస్కరణల కారణంగా వేలం ప్రక్రియలో పోటీ ఇనుమడించి, బొగ్గు ఉత్పత్తీ జోరెత్తగలదని కేంద్రం భావిస్తోంది. బహుళజాతి సంస్థల ప్రవేశంవల్ల భూగర్భ బొగ్గు నిక్షేపాల్ని వెలికితీసే అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానం సైతం అందుబాటులోకి రానుందన్న అంచనాలు కొత్త ఆశల్ని మోసులెత్తిస్తున్నాయి.

దేశంలో బొగ్గు సరఫరా మందగించడం తరువాయి, ఉత్పాదక రంగాలు పొగచూరిపోవడం ఏళ్ల తరబడి అనుభవమవుతోంది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో మూడొంతుల దాకా వాటా కలిగిన కోల్‌ఇండియా ఏటికేడాది లక్ష్యసాధనలో మందకొడితనంతో విదేశీ దిగుమతుల బిల్లును పెంచేస్తోంది. 1973లో బొగ్గు గనుల జాతీయీకరణ తరవాత రెండేళ్లకు కోల్‌ఇండియాను కొలువుతీర్చారు. పలు భారీ పరిశ్రమాగారాలకు అతి ముఖ్య ముడిసరకైన బొగ్గును అందుబాటులో ఉంచేలా చూడటంలో అది ఇప్పటికీ వరస వైఫల్యాల్ని మూట కట్టుకుంటూనే ఉంది. పర్యవసానంగా దాపురించిన పరాధీనత- వెలుపలి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాలతో చెదిరిపోగలదన్న అంచనాల వెలుగులో మోదీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ‘మహారత్న’ ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందిన కోల్‌ఇండియా లిమిటెడ్‌ నిరుటి ఉత్పత్తి సుమారు 60 కోట్ల టన్నులు.

ముందడగువేయాలి..

2023-24 సంవత్సరానికి వందకోట్ల టన్నుల నిర్దేశిత లక్ష్యం చేరుకోవడానికి అది సకల శక్తియుక్తులూ కూడగట్టుకోని పక్షంలో- ప్రైవేటు పోటీతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ సరసన చేరక తప్పదన్నది చేదు నిజం. విదేశీ పెట్టుబడులు జోరెత్తి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు విప్పారుతాయంటున్న ప్రభుత్వం- దాదాపు మూడు లక్షలమంది కోల్‌ ఇండియా ఉద్యోగ శ్రేణుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ముందడుగేయాలి. ఆ సంస్థకు తగినన్ని క్షేత్రాల్ని కేటాయించి అవసరమైన ప్రోత్సాహం అందిస్తామన్న బొగ్గు శాఖామాత్యులు ప్రహ్లాద్‌ జోషీ భరోసాతో ఇకమీదట జూలు విదల్చాల్సిన బాధ్యత కోల్‌ఇండియాది. వెలుపలి పెట్టుబడులు స్థిరప్రవాహ దశ సంతరించుకునేలోగా కోల్‌ఇండియా పనితీరు గాడిన పడితే, దేశార్థికానికి అది గొప్ప తీపి కబురవుతుంది.

విడ్డూరమైన పరిస్థితి..

నల్లబంగారంగా వ్యవహరించే బొగ్గు నిల్వలు, దిగుమతులకు సంబంధించి భారత్‌ది విడ్డూరమైన పరిస్థితి. అత్యధిక బొగ్గు నిక్షేపాలు కలిగిన దేశాల జాబితాలో అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, చైనాల తరవాత అయిదో స్థానం ఇండియాది. గరిష్ఠ దిగుమతుల ప్రాతిపదికన జపాన్‌ (16.7శాతం)ను వెన్నంటి రెండో స్థానం ఇండియా (16.2శాతం)దే! మునుపటి యూపీఏ జమానా జాతీయీకరణ చట్టాన్ని అడ్డుపెట్టుకుని జాతి వనరులైన బొగ్గు గనుల్ని అస్మదీయులకు అడ్డగోలుగా పందేరం చేసి పరువు మాయడం తెలిసిందే. ఆరేళ్ల క్రితం 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్ని సుప్రీం ధర్మాసనం రద్దు చేయడానికి ప్రేరణ 1993 లగాయతు చోటు చేసుకున్న అవకతవక బాగోతాలే. పారదర్శకతకు పెద్దపీట వేసి, ఈ-వేలం పాటల పద్ధతిని ప్రోత్సహిస్తామని దశసూత్ర అజెండాలో ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడిక మేలిమి నమూనాకు ఒరవడి దిద్దాలి. బొగ్గు దిగుమతుల్ని కనిష్ఠ స్థాయికి కుదించేలా ఇటు కోల్‌ ఇండియాను అటు బహుళ జాతి సంస్థలను ఉరకలెత్తించాలి.

ఇంతవరకు రద్దయిన బొగ్గు క్షేత్రాల్లో ఇరవై తొమ్మిదింటినే వేలం వేశారు. ఈ స్థితిలో సంస్కరణల కసరత్తు ఫలప్రదమయ్యేలా మైనింగ్‌ లీజుల అనుమతుల జారీ విధి విధానాలపరంగా ఏళ్ల తరబడి యంత్రాంగంలో తిష్ఠ వేసిన అలసత్వ ధోరణుల్నీ సాకల్యంగా ప్రక్షాళించాలి. వాణిజ్య అనుకూల వాతావరణం ప్రస్ఫుటమైనప్పుడే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బారులు తీరతాయి. దేశంలో ఎక్కడైనా సరే గనుల తవ్వకం పూర్తయిన చోట్ల తిరిగి ఆకుపచ్చదనం ఏర్పరచే బాధ్యతను సంబంధిత లీజుదారులకే కట్టబెడుతూ కేంద్రం నిబంధనావళిని పరిపుష్టీకరించాలని సర్వోన్నత న్యాయస్థానం మొన్ననే నిర్దేశించింది. నల్లబంగారానికి సంస్కరణల నగిషీ ఆరంభించిన కేంద్రం, జీవ వైవిధ్యానికి గొడుగుపట్టేలా సుప్రీం ఆదేశాల స్ఫూర్తినీ ఔదల దాల్చాలి!

ఇవీ చూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..

ABOUT THE AUTHOR

...view details