గడచిన అయిదేళ్లలో ఏ కేంద్ర బడ్జెట్‌కూ లేనంత ప్రాధాన్యం 2020-2021 బడ్జెట్‌కు ఉండబోతోంది. భారత ఆర్థికవ్యవస్థను పీడిస్తున్న సమస్యలు మరింత తీవ్రరూపం ధరించవచ్చుననే భయాల మధ్య కొత్త బడ్జెట్ వెలువడనుంది. ప్రస్తుతం పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధిరేటు మందకొడిగా ఉంది. వ్యవసాయ రంగాన్ని చూస్తే అది మరింత అధ్వానంగా ఉంది. ఇది చాలదన్నట్లు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఒక్కమాటలో భారత ఆర్థికాభివృద్ధి స్తంభించిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌ను వచ్చే అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందించడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న అంతటా మార్మోగుతోంది.
అయితే మోడువోయిన చెట్టు మళ్ళీ కొత్త చివుళ్లు తొడుగుతున్నట్లు ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఆశాకిరణాలు పొడసూపుతున్నాయి. ఈమధ్య పారిశ్రామికోత్పత్తి కాస్త పుంజుకోవడం ఒక ఆశావహ సూచన. ద్రవ్యోల్బణం విషయంలో మాత్రం అనిశ్చితి అలుముకొంటోంది. పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెచ్చరిల్లితే మన ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడకమానదు. మరోవైపు రుతు పవనాలు ఆలస్యంగా రావడం, అనేక రాష్ట్రాల్లో వరదలు విరుచుకుపడటం వల్ల ఖరీఫ్ ఉత్పత్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగినా, రైతు చేతికి ఎక్కువ డబ్బు వచ్చి, గ్రామాల్లో వస్తుసేవల వినియోగం పుంజుకొంటుంది. దానివల్ల పరిశ్రమలు, సేవారంగం మెరుగుపడతాయి.
కొనుగోలు శక్తి పెంపే లక్ష్యం కావాలి...
వేగంగా మారిపోతున్న సాంకేతికత, ప్రభుత్వానికి, కంపెనీలకు, కుటుంబాలకు కొండలా పెరిగిపోయిన అప్పుల భారం, ప్రపంచ వాణిజ్యంలో ప్రకంపనలు కలగలసి భారత ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలను మార్చివేసే అవకాశముంది. ఈ మార్పు దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. ఈ పరిణామాల మధ్య భారత్ ఎలా నిలదొక్కుకుని కొత్త అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తుందనే అంశం రాగల కొన్ని సంవత్సరాల్లో చేపట్టే విధానాలు, కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత మందగతికి చాలానే కారణాలున్నా, వాటిలో పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రభావం చాలా ముఖ్యమైనది. ఈ రెండు చర్యలు చేపట్టిన తరవాత మొదటి రెండు మూడేళ్లలో అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతినగా, సంఘటిత రంగం వృద్ధి నమోదు చేయగలిగింది. సంఘటిత రంగం కన్నా అసంఘటిత రంగమే అత్యధికంగా ఉపాధి వ్యాపార అవకాశాలను కల్పిస్తోంది. కాబట్టి అసంఘటిత రంగ విధ్వంసం దేశ ఆర్థిక వ్యవస్థను వెనక్కులాగింది. అసంఘటిత రంగంలో పెద్ద సంఖ్యలో జనం జీవనోపాధి కోల్పోవడంతో వస్తు సేవల వినియోగం దారుణంగా పడిపోయింది.
ఇలా గిరాకీ తగ్గిపోవడంతో ఉత్పత్తీ పతనమై మొత్తం ఆర్థిక వ్యవస్థ మందగతిలోకి జారిపోయింది. దీంతో సంఘటిత రంగంలోని పెద్ద కంపెనీలకూ విక్రయాలు, లాభాలు మందగించాయి. అందువల్ల కొత్త పెట్టుబడుల కోసం అవి రుణాలు తీసుకోవడం తగ్గించేశాయి. 2019 అక్టోబరు-నవంబరు మధ్యకాలంలో భారీ కంపెనీల రుణ స్వీకారం నాలుగు శాతం మేర దిగివచ్చింది. మరోవైపు కేంద్రం సబ్సిడీలను నియంత్రించడం వల్ల జనం చేతిలో డబ్బులు ఆడక వస్తుసేవలవినియోగం మరింత దెబ్బతింది. సబ్సిడీల కింద ఇచ్చే మొత్తం తగ్గిపోవడంతోపాటు వాటి రూపూ మారిపోతుంది. సబ్సిడీలను వస్తు రూపంలో కాకుండా నగదు రూపంలో నేరుగా లబ్ధిదారులకు చేరుతోంది. ఈ డబ్బును ఎలా వినియోగిస్తారన్న అంశమే ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
ఈ పరిస్థితిలో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి రెండు సంవత్సరాలు జనాకర్షక విధానాలపై డబ్బు వెదజల్లడం మాని పెట్టుబడులు పెంచడానికి ప్రాధాన్యమివ్వాలి. 2020-21 బడ్జెట్ ఈ పని చేస్తే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిన పడి, భవిష్యత్తులో అధిక వృద్ధి రేటును అందుకోగలుగుతుంది. ఎన్నికల ముందు ఒకటి రెండేళ్లపాటు అధికార పార్టీ మళ్ళీ పగ్గాలు చేపట్టడం కోసం సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు చేయడం వల్ల కొత్త పెట్టుబడులకు కొరత ఏర్పడుతుంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రభుత్వాలు అప్పు చేసి మరీ సంక్షేమంపై ఖర్చు చేస్తాయి. దీనివల్ల వస్తుసేవలకు గిరాకీ పెరుగుతుందనేది అపోహ మాత్రమే. పెరిగేవి అప్పులు మాత్రమే. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు రుణ మాఫీలు, సబ్సిడీల పెంపు, పన్ను కోతల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి అధికమవుతుంది. దానికి తలొగ్గితే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలి. సుస్థిర ఆర్థిక భవిష్యత్తు కోసం పన్ను రాయితీలు ఇచ్చి, పెట్టుబడులను పెద్దయెత్తున ప్రోత్సహించి, కొత్త ఉపాధి వ్యాపార అవకాశాలను సృష్టించాలి.
అప్పుల భారాన్ని ఉన్న పళాన తగ్గించుకోవడం అంత తేలిక కాదు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించేవారికన్నా ఎగవేసేవారే అధికమైనప్పుడు పెను సమస్య వచ్చిపడుతుంది. నేడు భారతీయ బ్యాంకుల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) పెరిగిపోవడానికి కారణమిదే. ఎన్‌పీఏల సమస్య తీరకుండానే బ్యాంకులు కొత్త అప్పులు మంజూరు చేస్తే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకొంటుందనే అర్థం లేని వాదన ఒకటి వినిపిస్తూ ఉంటుంది. బ్యాంకులు మళ్ళీ కొత్త అప్పులు ఇస్తే తాత్కాలికంగా ప్రయోజనం కనిపించినా తరవాత మళ్ళీ పుట్టి మునిగిపోతుంది. ఇచ్చిన అప్పులు వాపసు రాకుండానే కొత్త అప్పులు ఇవ్వడమంటే ఊబిలో పోయడమే. రేపు అవసరమైనప్పుడు అప్పులు పుట్టకుండా పోతాయి, పెట్టుబడులూ స్తంభిస్తాయి. కంపెనీలు, కుటుంబాలతోపాటు కేంద్ర ప్రభుత్వమూ తాహతుకు మించి అప్పులు చేస్తుంది. ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తుంది.
గతేడాది పన్నుల ఆదాయం కేవలం 7.1 శాతం పెరగ్గా, ఖర్చులు 9.8 శాతానికి చేరుకున్నాయి. 2018-19 ఏప్రిల్-నవంబరు మధ్యకాలంతో పోలిస్తే 2019-20 అదే కాలంలో అప్పులు 17.1 శాతం పెరిగాయి. నేడు కేంద్ర ప్రభుత్వం నెలకు లక్ష కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్‌పీఏలతో కుంగిపోయిన బ్యాంకులు ఆదాయం కోసం వ్యక్తిగత రుణాల మంజూరును ఎక్కువ చేశాయని రిజర్వు బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఆర్థిక మందగతిలో వ్యక్తుల ఆదాయాలు పడిపోతున్న దశలో వారికి రుణ మంజూరును పెంచడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.