తెలంగాణ

telangana

ETV Bharat / business

కేంద్ర నిధులు పెరగాలి - రాష్ట్రాలు వెలగాలి - ఆర్థిక సంఘం ప్రధాన వ్యాసాలు

కేంద్ర, రాష్ట్రాల మధ్య 2020-25 ఆర్థిక సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వ పన్ను, ఇతర ఆదాయాల్లో విభజించదగ్గ మొత్తాలను పంచడానికి ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్‌) కాలపరిమితి నిరుడు అక్టోబరు 30తో ముగిసింది. పలు కారణాల దృష్ట్యా కాలపరిమితిలో తన నివేదికను ప్రభుత్వానికి అందించలేకపోయింది. దీంతో గడువును మరో ఏడాది పొడగించింది. కొన్ని క్లిష్ట పరిస్థితులే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిని పెంచడానికి ప్రధాన కారణాలయ్యాయి. ఆర్థిక సంక్షోభాన్ని సరిగ్గా అంచనా వేయకుండా ముందుకు వెళ్తే, ఇప్పటికే సంక్షోభంలోఉన్న కేంద్ర ఆర్థిక పరిస్థితిని కమిషన్‌ సిఫార్సులు మరింత దిగజార్చే అవకాశం ఉంది.

The 15th Finance Commission (Finance Commission), which is set to distribute central government tax and other revenues for the fiscal years 2020-25 between the Center and the state, ended on October 30.
నిధులు పెరగాలి-రాష్ట్రాలు వెలగాలి

By

Published : Jan 1, 2020, 9:03 AM IST

కేంద్రం, రాష్ట్రాల మధ్య 2020-25 ఆర్థిక సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వ పన్ను, ఇతర ఆదాయాల్లో విభజించదగ్గ మొత్తాలను పంచడానికి ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్‌) కాలపరిమితి నిరుడు అక్టోబరు 30తో ముగిసింది. దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పులదృష్ట్యా ముందు ఇచ్చిన కాలపరిమితిలో సంఘం తన నివేదికను ప్రభుత్వానికి అందించలేకపోయింది. దరిమిలా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిని మరో ఏడాది- అంటే 2020 అక్టోబరు 30 వరకు పొడిగించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 మార్చి 31 వరకే అమలులో ఉంటాయి. కాబట్టి, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జరగాల్సిన నిధుల పంపకాలపై 15వ ఆర్థిక సంఘం తన మొదటి నివేదికను ప్రభుత్వానికి అందించింది. తదుపరి అయిదేళ్ల నివేదికను ఈ ఏడాది అక్టోబరు 30న సమర్పిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఆరేళ్లు అమలులో ఉంటాయి. ఈ వ్యవహారం ఇంతకుముందున్న ఆర్థిక సంఘాలకు భిన్నం.

అప్పుడూ ఇలానే

తొమ్మిదో ఆర్థిక సంఘం కాలంలోనే ఇలా జరిగింది. కమిషన్‌ తన మొదటి నివేదికలో రాష్ట్రాల వాటాపై 14వ ఫైనాన్స్‌ కమిషన్‌కు భిన్నంగా ఏ మార్పూ చేయలేదన్నది ప్రాథమిక సమాచారం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన వాటాల మేరకే కేంద్ర ఆర్థిక శాఖ రాబోయే బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. కమిషన్‌ చివరి నివేదిక మొదటిదానికన్నా భిన్నంగా ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సంఘం తన చివరి నివేదికలో 2021-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిధులపంపకాలపై సిఫార్సులు చేస్తుంది. అంటే ఒక ఏడాది తరవాతే- ఎంత మొత్తంలో నిధులు 2021 ఏప్రిల్‌ ఒకటి నుంచి అయిదేళ్లపాటు అందుతాయో తెలిసే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది. దీని తరవాతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక దృక్పథంతో తమ అభివృద్ధి పథకాలను రూపొందించుకునే అవకాశం ఉంది. ఆ పథకాల విశ్లేషణ, లోపాల దిద్దుబాటుకు కావలసిన సమయం కూడా ఏడాది తరవాతే ఉంటుంది. కానీ, 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి అయిదేళ్లపాటు నిధులను ఆశించి రూపొందించుకున్న ప్రణాళికలు, పథకాలపై ఈ పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

మందగమన ప్రభావం

కొన్నేళ్లుగా వినియోగం, పెట్టుబడుల్లో చోటుచేసుకున్న మందగమనం ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తోంది. ప్రైవేటు తుది వినియోగ వ్యయం- జీడీపీలో 66.2 శాతం (2012-14) నుంచి 57.5 శాతానికి (2015-19) క్షీణించి, వినియోగ డిమాండులో మందగమనాన్ని నమోదు చేసింది. పెట్టుబడి రేటు 32.3 శాతానికి పడిపోయింది. నిరుద్యోగిత రేటు 6.1కి చేరి 45 సంవత్సరాల గరిష్ఠ స్థాయిని సూచిస్తోంది. భారత్‌లో ఈ ఆర్థిక మందగమనం గతంలో ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఉంటుందని అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ హెచ్చరించింది. 2019-20 జులై-సెప్టెంబరు త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 4.5 శాతానికి పడిపోయింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. జీఎస్‌టీ వసూళ్లు మే నుంచి నెలవారీ లక్ష కోట్లరూపాయల కంటే తక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం. 2019-20 సంవత్సరానికి స్థూల పన్నుఆదాయం రూ.25.52 లక్షలకోట్లుగా అంచనా వేసినా, 2018-19 ప్రొవిజనల్‌ ఖాతాల ఆధారంగా చూస్తే ఇది కేవలం రూ.23.61 లక్షలకోట్లు మాత్రమే. ఈ స్థూల పన్ను ఆదాయం 2020-21లో రూ.2.16 లక్షల కోట్ల నుంచి 2024-25లో రూ.3.70 లక్షల కోట్లకు తగ్గుతుందని ప్రభుత్వ అంచనా. ఈ లెక్కన రాబోయే అయిదేళ్లలో స్థూలపన్ను ఆదాయం ముందున్న అంచనాకంటే రూ.15 లక్షల కోట్లు తక్కువని 15వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం నివేదించింది. తగ్గుతున్న ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలు ప్రభుత్వ వ్యయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

ఆమడ దూరంలో లక్ష్యాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించుకున్న ఆర్థిక, ఆదాయ లక్ష్యాలు ఆమడదూరంలో ఉన్నాయి. కాగ్‌ అభిప్రాయం ప్రకారం 2017-18లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 5.85 శాతం. అయితే ప్రభుత్వరంగ సంస్థల నిధులను అదనపు బడ్జెట్‌ వనరుల రూపంలో సమకూర్చుకుని కేంద్రం ద్రవ్యలోటును కేవలం 3.46 శాతంగానే ప్రకటించింది. ఇలాంటి అస్పష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో అసలు ఎంత మొత్తంలో పన్ను ఆదాయం ప్రభుత్వానికి అందుతుందో అంచనా వేయడం కమిషన్‌కు పెద్ద సవాలుగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితులే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిని పెంచడానికి ప్రధాన కారణాలయ్యాయి. ఆర్థిక సంక్షోభాన్ని సరిగ్గా అంచనా వేయకుండా ముందుకు వెళ్తే, ఇప్పటికే సంక్షోభంలోఉన్న కేంద్ర ఆర్థిక పరిస్థితిని కమిషన్‌ సిఫార్సులు మరింత దిగజార్చే అవకాశం ఉంది. కారణం- ఇటీవలే ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను రేటును తగ్గించడం వల్ల పన్ను ఆదాయంలో దాదాపు 1.45 లక్షల కోట్ల రూపాయలు కోత పడింది. దీనికితోడు జీఎస్టీ పన్ను ఆదాయాలు అంచనాకు చాలా దూరంలో ఉన్నాయి. 2019-20 సంవత్సరానికి జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యం రూ.6,63,343 కోట్లు. మొదటి ఎనిమిది నెలల్లో 50 శాతమే వసూలైంది. ఈ పరిస్థితుల్లో విభజించదగిన పన్నులమొత్తం నుంచి ఒక ప్రత్యేక యంత్రాంగం ద్వారా రక్షణ, అంతర్గత భద్రతా రంగాలకు సమకూర్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం తన సొంత వాటాను మెరుగుపరచే పనిలో పడింది.

తెలుగు రాష్ట్రాల అభ్యంతరం

రాష్ట్రాల మధ్య సమాంతరంగా విభజించదగ్గ కేంద్ర పన్ను ఆదాయాలను పంచేటప్పుడు 2011 జనాభాను 15వ ఆర్థిక సంఘం ప్రాతిపదికగా తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమిషన్‌ ఈ నష్టాన్ని మరో రూపంలో పూడ్చాల్సి ఉంటుంది. లేదంటే జనాభా వృద్ధిరేటును నియంత్రించినందుకు కేంద్రంనుంచి అందాల్సిన వాటాలో కోతలు పడతాయి! జనాభా పెరుగుదల రేటును తగ్గించడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన పురోగతి సాధించింది. 42వ రాజ్యాంగ సవరణ(1971) ప్రకారం రాష్ట్రాల పునర్విభజన విషయంలో, పార్లమెంటులో ప్రాతినిధ్యం అంశంలో 1971 జనాభా లెక్కలను 2001 సంవత్సరం వరకు పరిగణనలోకి తీసుకోవాలి. దీన్ని 84వ రాజ్యాంగ సవరణ (2001) ద్వారా మరో 25 ఏళ్లు అంటే 2026 వరకు పొడిగించారు. కుటుంబ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, వాటిని సమర్థంగా అమలు చేయడమే ఈ సవరణల ముఖ్యోద్దేశం. వీటిని విస్మరించి రాష్ట్రాలమధ్య నిధులను పంచడానికి 2011 జనాభా లెక్కలను కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి.

తెలంగాణకు అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం

రాష్ట్ర విభజన తెలంగాణను ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉంచింది. 2016-18 సంవత్సరంలో 14.2 శాతం, 2018-19లో 15 శాతం ఆర్థికవృద్ధిని తెలంగాణ నమోదు చేసింది. సంక్షేమ పథకాలు, నీటిపారుదల రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు కలవరపెడుతున్నాయి. ప్రభుత్వ మొత్తం రుణాలు 2019-20 బడ్జెట్‌లో రూ.2.03 లక్షలకోట్లకు చేరాయి. దేశ ఆర్థిక మందగమనం రాష్ట్రపన్ను ఆదాయాలను కుదించింది. వివిధ రకాల సంక్షేమ పథకాలు, రైతుబంధు, కాళేశ్వరం వంటి నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ వంటి తాగునీటి కార్యక్రమాలవల్ల ప్రభుత్వ వ్యయం పెరుగుతోంది. రాష్ట్ర జీఎస్‌డీపీలో 50 శాతం కేవలం హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌ నాలుగు జిల్లాలనుంచే వస్తోంది. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రానికి చాలా అవసరం. ఈ పథకాలన్నీ సమర్థంగా నడవటానికి రాష్ట్రానికి కేంద్రసహాయం కీలకం. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు ప్రభుత్వానికి కొంత ఊరటనిస్తాయి. అయితే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు నష్టం చేకూరుతుంది.

-డాక్టర్.కల్లూరు శివారెడ్డి(రచయిత-పుణెలోని గోఖలే ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పాలిటిక్స్​ అండ్ ఎకనామిక్స్​లో ఆచార్యులు)

ABOUT THE AUTHOR

...view details