తెలంగాణ

telangana

ETV Bharat / business

సిరి: మీ పిల్లలకు ఈ పాఠాలు నేర్పుతున్నారా? - ఈటీవీ భారత్​

ఇంటర్నేషనల్​ స్కూల్​లో విద్య... పాఠశాల స్థాయి నుంచే ఐఐటీ కోచింగ్​... ఈత, బ్యాడ్మింటన్​ వంటి క్రీడల్లో శిక్షణ...! సగటు విద్యార్థి రోజువారీ జీవితం ఇది. మెరుగైన భవిష్యత్​ కోసం ఇవి సరిపోతాయా? ఆర్థిక భవితకు భరోసా ఇచ్చే పొదుపు పాఠాలు నేర్పాల్సిన పనిలేదా? ఉంటే... మీ పిల్లలకు నేర్పుతున్నారా?

పొదుపు పాఠాలు

By

Published : Jun 23, 2019, 11:44 AM IST

పిల్లలు అడిగిన వెంటనే కావాల్సిన డబ్బును ఎందుకు? ఏమిటి? అని అడగకుండానే ఇచ్చేస్తుంటారు కొందరు తల్లిదండ్రులు. అయితే పిల్లల వద్ద డబ్బు గురించి మాట్లాడటం తప్పుగా భావించడం, వారు కాకపోతే ఇంకెవరు అడుగుతారు అని అనుకోవడం సహజం.

ఇది తప్పుకాకపోయినా.. పిల్లలు దీన్ని ఆసరగా చేసుకుని విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ, డబ్బు విలువ తెలియకుండా పెరిగే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా బుడి బుడి నడకలు, బుజ్జి బుజ్జి మాటలు నేర్పించినట్లే... కాస్త ఊహ తెలిసినప్పటి నుంచే ఆర్థిక అంశాలను అలవాటు చేయాలి.

మరి ఆ ఆర్థిక ప్రణాళిక ఎలా అమలు చేయాలో తెలుసుకుందాం.

ఆర్థిక ప్రణాళిక పరిచయం

బడికెళ్లి అంకెలు నేర్చుకున్నప్పటి నుంచే డబ్బు పరిచయం చేయడం ప్రారంభించండి. ఖర్చులకు ఇచ్చే ప్రతి రూపాయిని ఎందుకు ఇస్తున్నారో ముందే తెలియజేయండి. రోజూ ఇచ్చే పాకెట్​ మనీలో కొంత మొత్తంలో పొదుపు చేయమని చెప్పండి. ఆ డబ్బుతో ఏదైనా ఖరీదైన వస్తువు(ఆట వస్తువుల్లాంటివి) కొనమని ప్రోత్సహించండి.

ఇలా చేస్తే వారికి కోరికకు, అవసరానికి మధ్య తేడా తెలిపినవాళ్లు అవుతారు. అప్పుడు వాళ్లు కావాల్సినవి పొందుతూనే, పొదుపు వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటారు.

బ్యాంకు ఖాతా తెరిపించండి

పిల్లలు కొంచెం పెద్దయ్యాక వారితో బ్యాంకు ఖాతా తెరిపించండి. నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతా నిర్వహించడం, ఖాతాలో కొంత సొమ్ము వేసి పొదుపు చేయడం వంటి విషయాలు నేర్పించండి.

ఇక్కడొక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. వారు ఏదైనా వస్తువు కొనాల్సి వచ్చి, బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవాలని భావిస్తే ప్రోత్సహించడమే మేలు. వారిని నిరాశపరిస్తే పొదుపుపై తప్పుడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంది.

కొనుగోళ్లకు స్వేచ్ఛనివ్వండి....

పిల్లలు ఏదైనా వస్తువు కొనాలనుకుంటే పూర్తి స్వేచ్ఛ వారికే వదిలేయండి. ఎక్కువ సంతృప్తినిచ్చేది, అవసరమైనది కొనుక్కునేలా ప్రోత్సహించండి. సదరు వస్తువు ఎందుకు కొనుగోలు చేశారు, ఎందుకు చేయలేదు అని అడగండి. ఇప్పుడే కొనాలా లేక తర్వాతైనా కొనుక్కునే వీలుందా కనుక్కోండి. ఇదే వస్తువు వేరే ఎక్కడైనా తక్కువ ధరకు దొరుకుతుందేమో పిల్లల్ని అడిగి తెలుసుకోమనండి.

ఇలా చేస్తే వారి ఆలోచనల్లో పొరపాట్లు ఏంటో వారికి అర్థమవుతాయి. భవిష్యత్​లో పునరావృతం కాకుండా ఉంటాయి.

ఇంటి నిర్వహణ గురించి చెప్పండి

కొంచెం పెద్దయ్యాక.. మీ పిల్లలకు కొంత డబ్బు ఇచ్చి కరెంటు, టీవీ బిల్లులు చెల్లించమనండి. సూపర్​ మార్కెట్​లో సరుకులు తీసుకురమ్మని చెప్పండి. తద్వారా ఇల్లు ఎలా గడుస్తుంది? నెలవారీ ఖర్చులు ఎంత మొత్తంలో ఉంటాయి? అనే విషయాలపై అవగాహనతో పాటు అర్థిక పరిస్థితులు కూడా తెలుసుకుంటారు.

పెట్టుబడులకు ప్రోత్సహించండి

సమాజంపై అవగాహన, ఆర్థిక అంశాలను అర్థం చేసుకునే వయస్సు వచ్చాక.. పెట్టుబడి, వడ్డీ, పన్నుల వంటి అంశాలను పరిచయం చేయండి.
ఇలా చిన్నప్పటి నుంచి అలవాటైన ఆర్థిక క్రమశిక్షణ కారణంగా భవిష్యత్ అవసరాలకు తీసుకునే నిర్ణయాలు ఇతరులతో పోలిస్తే కచ్చితంగా మెరుగ్గా ఉంటాయి.

ఇదీ చూడండి: 'చిత్తశుద్ధి లేనందునే మల్టీ లెవల్ మోసాలు'

ABOUT THE AUTHOR

...view details