సార్వత్రిక బడ్జెట్లో ఆదాయపన్ను చెల్లింపుల్లో కొత్త విధానాన్ని ప్రతిపాదించింది కేంద్రం. పాత విధానాన్ని కొనసాగిస్తూనే కొన్ని షరతులతో నూతన పద్ధతిని ప్రవేశపెట్టింది. ఏ పద్ధతిలో పన్ను కట్టాలన్నది చెల్లింపుదారుని ఇష్టానికే వదిలేసింది. ఒకసారి కొత్త విధానానికి మొగ్గు చూపితే ఆ తర్వాత అదే పద్ధతిలోనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త విధానంలో చెల్లించేవారు ప్రస్తుతం ఇస్తున్న మినహాయింపులు, తగ్గింపులను వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం. ఒకవేళ నూతన పద్ధతికే మొగ్గుచూపితే ఇప్పటివరకు ఇస్తున్న రూ. 50వేల ప్రామాణిక తగ్గింపు, పిల్లల చదువుల ఖర్చులు, బీమా, పింఛను చందా, పీఎఫ్ల్లో కోత పడనుంది.
బడ్జెట్లో పేర్కొన్న ప్రకారం.. కొత్త విధానాన్ని ఎంపిక చేసుకున్న చెల్లింపుదారునికి ఆదాయపు పన్నులోని పలు కీలక సెక్షన్లు వర్తించవని తెలిపింది. 80సీ, 80సీసీసీ, 80డీ, 80ఈ తదితర సెక్షన్లను చెల్లింపుదారుడు వదులుకోవాల్సి ఉంటుంది. కొత్త ఆదాయపన్ను విధానంలో వర్తించని ఈ సెక్షన్లలో ఏముందంటే..
సెక్షన్ | అంశాలు |
80సీ | బీమా ప్రీమియం, పీఎఫ్, కొన్ని రకాల షేర్లు |
80సీసీసీ | పింఛను చందా |
80డీ | ఆరోగ్య బీమా |
80ఈ | ఉన్నత విద్యా రుణాలపై వడ్డీలు |
80ఈఈ | గృహనిర్మాణ రుణాలపై వడ్డీలు |
80ఈఈబీ | విద్యుత్ వాహనాల కొనుగోలు |
80జీ | స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు, ఇంటి అద్దె |