దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలు మరోసారి పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే వారం నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.
స్టీల్ సహా ఇతర విలువైన లోహాల కొనుగోలు వ్యయాలు పెరిగిన కారణంగా.. కార్ల ధరలు పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే మే నెలలో ప్యాసింజర్ వాహనాల ధరలు 1.8 శాతం మేర పెంచింది టాటా మోటార్స్. వాణిజ్య వాహనాల ధరలను రెండు సార్లు పెంచింది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో.. టియాగో, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తోంది టాటా మోటార్స్. ఏ మోడల్ ధర ఎంత పెరగనుందనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.
ధరలు పెరిగేందుకు అసలు కారణాలు..
'స్టీల్ సహా ఇతర ముడి సరకు వ్యయాలు ఈ ఏడాది క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఇలా ఇప్పటి వరకు ఆ వ్యయాల భారం మా ఆదాయంపై 8-8.5 శాతం వరకు పడింది. అయినప్పటికీ.. 2.5 శాతం భారాన్ని మాత్రమే వినియోగదారులకు బదిలీ చేశాం. ఎక్స్ షోరూం ధరతో ఇది 3 శాతంగా ఉండొచ్చు.' అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగాధిపతి శైలేశ్ చంద్ర పేర్కొన్నారు. ఖర్చులు తగ్గించుకున్నప్పటికీ.. ప్రస్తుతం ధరల పెంపు తప్పడం లేదని వివరించారు.
ధరల పెంపు నిర్ణయం తీసకున్న ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్ మాత్రమే కాదు. గత నెలలో మారుతీ సుజుకీ కూడా అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచింది. ఇప్పుడు మరిన్ని సంస్థలు కూడా ధరల పెంపునకు సిద్ధమయ్యాయి.
ఇదీ చదవండి:వాహన ధరలు మరోసారి పెంపు?