బిట్‌కాయిన్.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఎక్కువ మంది చర్చించుకుంటున్న విషయాల్లో ఇదీ ఒకటి. ఒక బిట్‌కాయిన్ విలువ ఇప్పుడు 45,000 డాలర్లపైనే ఉంది. గత ఏడాది డిసెంబర్లోనే తొలిసారి 20 వేల డాలర్ల మార్క్ దాటిన బిట్‌కాయిన్.. రెండు నెలల్లోనే 45 వేల డాలర్లపైకి చేరడం విశేషం.
విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల 1.5 బిలియన్ డాలర్లు బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడం కూడా బిట్ కాయిన్ విలువ ఈ స్థాయికి చేరేందుకు కారణం.
భారత్ విషయానికొస్తే.. క్రిప్టోకరెన్సీకి సంబంధించి త్వరలో బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు.
'ఇప్పుడున్న చట్టాలకు క్రిప్టోకరెన్సీతో వస్తోన్న సమస్యలను పరిష్కరించే సామర్థ్యం లేదు. అంతేకాదు ఆర్బీఐ, సెబీ లాంటి నియంత్రణ సంస్థలకు కూడా క్రిప్టో కరెన్సీ వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి చట్టపరమైన అధికారాలు లేవు. అందుకే కొత్త బిల్లును తీసుకురావాలనుకుంటున్నాం. బిల్లు తుది రూపు దాల్చింది. కేబినెట్ ఆమోదానికి పంపడమే మిగిలింది.' అని వివరించారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో చాల మందిలో క్రిప్టోకరెన్సీపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. అలాంటి సందేహాలన్నింటికీ 'ఈటీవీ భారత్' అందిస్తున్న సమాధానాలు మీ కోసం.
ఏమిటీ క్రిప్టోకరెన్సీ?
క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేక సాఫ్ట్వేర్ కోడ్ల ద్వారా పని చేస్తుంటాయి. సాధారణ కరెన్సీలు (రూపాయి, డాలర్ వంటివి) భౌతికంగా చలామణి అవుతుంటాయి. క్రిప్టో కరెన్సీలు మాత్రం భౌతికంగా కనిపించవు, వాటిని ముట్టుకోలేం. ఇవి పూర్తిగా డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటాయి.
పేరుకు తగ్గట్లుగానే.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్ చైన్ సాంకేతికతలు క్రిప్టోకరెన్సీకి మూలాధారాలు.
ప్రస్తుతం బిట్‌కాయిన్, ఇథీరియం, స్టెల్లార్, రిపుల్, డాష్ సహా పలు ఇతర క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉన్నాయి. వీటన్నింటిలో బిట్‌కాయిన్ అత్యంత ఆధరణ పొందిన క్రిప్టో కరెన్సీ.
బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి?
క్రిప్టోకరెన్సీ ప్రస్తావన వచ్చినప్పుడు.. మనం చాలా సార్లు క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్, బ్లాక్ చైన్ సాంకేతికత గురించి వింటూనే ఉన్నాం.
బ్లాక్‌చైన్ అనేది డేటా బైస్ ఆధారంగా పని చేసే ఓ ప్రత్యేక సాంకేతికత. ఇందులో సమాచారం అనేది బ్లాకులుగా విభజన చెంది.. అదంతా ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది.
ఇలా ఒక సర్వర్‌కు మరో సర్వర్ అనుసంధానమై ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ చైన్ రూపంలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని ఎంతటి హ్యాకర్లయినా తస్కరించడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే క్రిప్టోకరెన్సీలను ఎవరూ నియంత్రించడం కూడా జరగదు. దీనితో పాటు అవి అత్యంత సురక్షితమనే వాదన కూడా ఉంది.
బిట్‌కాయిన్ పొందడం ఎలా?
బిట్‌కాయిన్‌ను వర్ణించాలంటే డిజిటల్ గోల్డ్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే.. బిట్ కాయిన్, బంగారం రెండూ అంత సులభంగా దొరకవు. వాటిని వెలికి తీయాలంటే.. చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొనాలంటే భారీగా ఖర్చవుతుంది.
బంగారం భౌతికంగా భూమిలో ఉంటుంది. దీన్ని పొందేందుకు మైనింగ్ చేయాల్సి ఉంటుంది. అదే తరహాలో కొత్త బిట్కాయిన్ల కోసం.. కంప్యూటర్ల ద్వారా మైనింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఎంతో క్లిష్టమైన క్రిప్టోగ్రఫీ సమస్యలను పరిష్కరించడం ద్వారా కొత్త బిట్కాయిన్లను రివార్డుగా పొందొచ్చు. చలామణిలోకి (డిజిటల్‌గా) వచ్చే బిట్కాయిన్ల సంఖ్య పెరిగే కొద్ది.. కొత్త సమస్యలు పరిష్కరించే వారికి రివార్డుగా వచ్చే కాయిన్లు తగ్గుతాయి. ఇదే సమయంలో పరిష్కరించాల్సిన సమస్యలు మరింత క్లిష్టంగా మారుతుంటాయి. ఒకానొక దశ తర్వాత కొత్త బిట్కాయిన్లు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. మొత్తం మీద 2.1 కోట్ల బిట్కాయిన్లు మాత్రమే మనుగడలో ఉంటాయి.
ఇప్పటి వరకు ఇలా 1.85 కొత్త బిట్కాయిన్లు చాలామణిలోకి (డిజిటల్‌గా) వచ్చాయి. ఇంకా 25 లక్షల కాయిన్లు మాత్రమే చలామణిలోకి రావాల్సి ఉంది.
బిట్‌కాయిన్ రూపకర్త ఎవరు?
బిట్‌కాయిన్ జపాన్‌కు చెందిన షాతోషీ నాకామోటో అనే టెకీ రూపొందించినట్లు ప్రచారంలో ఉంది. అయితే దీనిపై స్పష్టత లేదు. 2009లో బిట్‌కాయిన్ మనుగడలోకి వచ్చింది. రూపాయికి 100 పైసలు ఎలానో.. ఒక బిట్‌కాయిన్‌కు 100 షాతోషీలు ఉంటాయి.