జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లే. పూర్తిగా సొంత డబ్బు పెట్టి ఇంటిని నిర్మించే స్థోమత అందరికీ ఉండదు. ఇలాంటి వారందరికీ సొంతింటి కల నిజం చేసుకునేందుకు ఉన్న మార్గం గృహ రుణమే. ఇంటి విలువ ఎక్కువగా ఉండి, వ్యక్తికి వచ్చే రుణం తక్కువగా ఉన్నప్పుడు ఉన్న ప్రత్యామ్నాయం ఉమ్మడి రుణం తీసుకోవడం. ఈ ఉమ్మడి రుణంతో లాభనష్టాలేమిటి?
వ్యక్తిగత రుణ అర్హత సరిపోయేంత లేనప్పుడు ఉమ్మడిగా రుణం తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో అప్పు పొందేందుకు వెసులుబాటు దొరుకుతుంది. సాధారణంగా ఉమ్మడి రుణం కోసం ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకరికి ఇద్దరు కలిసినప్పుడు ఆదాయం పెరుగుతుంది కాబట్టి రుణ అర్హత కూడా అధికమవుతుంది. దీంతోపాటు సహా దరఖాస్తుగా ఉన్న వారి రుణ చరిత్ర బాగుంటే.. రుణం వచ్చెటందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా అప్పు తీసుకోవచ్చు. తల్లిదండ్రులతోనూ, తోబుట్టువులతోనూ కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు.
సహ దరఖాస్తు బాధ్యతలేమిటి?
రుణం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తికి మద్దతుగా సహ దరఖాస్తుదారు ఉండాలి. అతని ఆదాయం ప్రధాన రుణ గ్రహీతతో కలిసినప్పుడు ఆదాయం పెరగాలి, అతని గృహ చెల్లింపు సామర్ధ్యం అధికమవ్వాలి. అప్పుడే ఆశించిన రుణం రావడానికి అవకాశం ఉంటుంది. సహ దరఖాస్తుదారుడికి రుణానికి సంబంధించి అన్ని బాధ్యతలూ ఉంటాయి. ఒకవేళ ప్రధాన రుణ గ్రహీత వాయిదాలు సరిగ్గా చెల్లించలేదనుకోండి..దరఖాస్తుదారుడు ఆ బాధ్యతను నెరవేర్చాలి. అందుకే, రుణ సంస్థలు ఉమ్మడి రుణం ఇచ్చే ముందు ఇద్దరి రుణ చరిత్రనూ పరిశీలిస్తాయి. ఇలాంటప్పుడు క్రెడిట్ స్కోర్ ఎంతో ముఖ్యం.
ఇద్దరిపైనా ప్రభావం:
ఉమ్మడిగా రుణం తీసుకున్నప్పుడు ఆ ప్రభావం రుణగ్రహీతలిద్దరికీ ఉంటుంది. రుణ చెల్లింపును ఎవరు చేస్తున్నారన్నదీ ఇక్కడ ముఖ్యమే. వాయిదాలను సక్రమంగా చెల్లించకపోతే ఇద్దరి రుణ చరిత్ర, క్రెడిట్ స్కోర్ పైనా అది ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఇద్దరు కలిసి ఉమ్మడిగా రుణం తీసుకున్నారనుకుందాం. తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారనుకుందాం. అందులో వారు వాయిదాలు ఎవరు చెల్లించాలి అనే అంగీకారానికి వచ్చినా..రుణ సంస్థలు మాత్రం అప్పు ఇచ్చేప్పుడు కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉంటాయి. అలాంటప్పుడు రుణం తీర్చడానికి అంగీకరించిన వ్యక్తి వాయిదాలు చెల్లించకపోతే.. సహ దరఖాస్తుదారుడిగా ఉన్న వారి క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది. కాబట్టి, రుణం చెల్లింపులో అశ్రద్ధ తగదు.