నగదు రహిత చెల్లింపులకు పెరిగిన ఆదరణతో చాలామంది క్రెడిట్ కార్డులను వాడటం ప్రారంభించారు. అయితే, కార్డు వాడే విధానంలో కొన్ని మార్పులు చేసుకోకపోతే.. మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలతో అప్పుల వూబిలో కూరుకుపోకుండా.. క్రెడిట్ స్కోరు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. మరి ఆ మార్గాలేంటో తెలుసుకోండి.
కార్డు వినియోగంలో ఈ తప్పులొద్దు..
క్రెడిట్ కార్డును ఉపయోగించడమే కాదు.. వ్యవధిలోపు దాని బిల్లును తీర్చేయడమూ ముఖ్యమే. చాలామంది సమయానికి బిల్లులు చెల్లించక, పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు దానిని ఈఎంఐగా మార్చుకోవడంలాంటివి చేస్తుంటారు. కార్డు వినియోగంలో చేయకూడని తప్పులివి. కాబట్టి, ముందుగా జాగ్రత్త పడాల్సింది ఈ విషయంలోనే.
ఇబ్బంది అనిపిస్తే ఖర్చు వాయిదానే మేలు..
బిల్లు తప్పకుండా చెల్లిస్తామనే నమ్మకం ఉంటేనే పెద్ద లావాదేవీలు చేయండి. ఇబ్బందిగా ఉండొచ్చు అని ఏమాత్రం అనిపించినా మీ ఖర్చును వాయిదా వేసుకోవడమే ఉత్తమం. ఇప్పుడు ఖర్చు చేసి, తర్వాత చూసుకుందాం అనే మాట ఇక్కడ పనికిరాదని గుర్తించండి.
సాధారణంగా మీ కార్డు పరిమితిలో 30శాతానికి మించి వాడకుండా చూసుకోండి. పరిమితి ఉంది కదా అని పూర్తిగా వాడటం అంటే.. మీరు అప్పుల మీదే ఆధారపడ్డారనే సంకేతాలు వెళ్తాయి. భవిష్యత్తులో మీరేదైనా రుణం తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇది ఇబ్బందికరంగా మారవచ్చు.