నిరుడు మార్చి నుంచి వర్చువల్‌గా సమావేశమవుతూ వచ్చిన వస్తుసేవల పన్నుల (జీఎస్టీ) మండలి(GST Council Meeting) మొట్టమొదటిసారి ఈ నెల 17న లఖ్‌నవూలో ముఖాముఖి భేటీ నిర్వహించింది. ఈ భేటీలో మండలి పలు నిర్ణయాలు తీసుకున్నా పెట్రో ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్న సామాన్య వినియోగదారుడికి మాత్రం అసంతృప్తి మిగిలింది. సమస్య మూలాలను అర్థం చేసుకుని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కరవైన మండలి(GST Council Meeting) పదేపదే పన్నులు పెంచడంపై ఆసక్తి చూపుతోంది. ప్రజలపై పడే భారాన్ని పట్టించుకోవడం లేదు. పన్నులు పెంచడమే కాకుండా చిన్నాపెద్ద వ్యాపారాలన్నింటినీ తప్పనిసరిగా ప్రభుత్వ నియంత్రణలోకి, పన్నుల చట్రంలోకి తీసుకురావడమే సర్కారు లక్ష్యమని జీఎస్టీ మండలి నిర్ణయాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ మార్పును క్రమేణా కాకుండా ఉన్నపళాన తీసుకురావడానికి తొందరపడుతున్న ప్రభుత్వం, దీనివల్ల కలిగే కష్టనష్టాలను పట్టించుకోవడం లేదు. అసలే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, కరోనా దాడితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ ఇంకా తెప్పరిల్లకముందే మండలి(GST Council Meeting) తాజా నిర్ణయాలు గోరుచుట్టుపై రోకటి పోటులా వచ్చిపడ్డాయి. అదే పనిగా పన్నులు పెంచుకుంటూ పోతే దేశార్థిక వ్యవస్థలో ఉత్పత్తి, వ్యాపార వ్యయాలు పెరిగి గిరాకీ పడిపోతుందని జీఎస్టీ మండలికానీ, ప్రభుత్వంకానీ గ్రహించడం లేదు.
చమురు ధరలపై నిరాశ
పెట్రోలు, డీజిల్‌లను(GST Petrol news) జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారని, తద్వారా చమురు ధరలు తగ్గుతాయని ఆశించినవారిని జీఎస్టీ మండలి(GST Council Meeting) నిరాశపరచింది. అసలు కేరళ హైకోర్టు సూచన మేరకు ఈ అంశాన్ని పరిశీలించామే తప్పించి, ఇప్పుడప్పుడే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఓటు బ్యాంకు రాజకీయాలకు, దుబారా సబ్సిడీలకు పెట్రో ఆదాయమే కల్పవృక్షం కాబట్టి దాన్ని వదులుకునే ఉద్దేశం వాటికి ఏ కోశానా లేదు. పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు అయిదు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. దీన్ని వదులుకోవడానికి అవి సుతరామూ అంగీకరించవు. జీఎస్టీ విధానం వల్ల ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు నష్టపరిహార చెల్లింపును 2022 జూన్ తరవాత కొనసాగించేది లేదని కేంద్ర ఆర్థికమంత్రి స్పష్టం చేయడం గందరగోళానికి దారితీసింది. చివరికి రాష్ట్రాల ఒత్తిడితో ఈ గడువును 2026 వరకు పొడిగించాల్సి రావచ్చని ఆమె సూచించారు. జీఎస్టీ క్రమబద్ధీకరణతోపాటు ఇ-వే బిల్లులు, ఫాస్ట్‌ట్యాగ్, సాంకేతికత వినియోగం వంటి అంశాలను పరిశీలించడానికి జీఎస్టీ మండలి రెండు మంత్రుల బృందాలను నియమించింది. అవి రెండు నెలల్లో తమ నివేదికలను సమర్పించాలి. ఉద్యోగుల భవిష్యనిధి, ఈఎస్‌ఐలతో సహా అన్ని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల చెల్లింపులపై జీఎస్టీ గురించి సైతం ఈ బృందాలు పట్టించుకుంటాయని ఆశిద్దాం.
ఇతర దేశాల్లోనూ జీఎస్టీ ఉన్నా, భారతదేశంలో మాదిరిగా చిన్న వ్యాపారులు, కొనుగోలుదారులపై పన్నుల భారం పెంచలేదు. పెద్ద కంపెనీలు, వ్యాపారాలను సమర్థంగా పన్నుల చట్రంలోకి తీసుకురాలేకపోవడం వల్లనే ప్రభుత్వం సామాన్యులపై పడుతోంది. జీఎస్టీ పన్ను వాపసు కోసం దరఖాస్తు పెట్టుకునే వ్యక్తులు, సంస్థలకు ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేయడంతో నిఘా మరింత సమర్థంగా మారుతోంది. ప్రతి ఒక్కరూ సక్రమంగా పన్నులు చెల్లించాల్సిన అగత్యం ఏర్పడుతోంది. రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించే బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా పాన్ కార్డుతో అనుసంధానించాల్సి ఉంటుంది. జీఎస్టీ సొమ్మును కూడా అదే ఖాతాకు వాపసు చేయాలని నిబంధన పెట్టడం ద్వారా అందర్నీ పన్నుల చట్రంలోకి తీసుకురావడం వీలవుతుంది.
చిన్న వ్యాపారాలకు కష్టకాలం