పెట్టుబడులు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలానికి సంబంధించినవి ఉంటాయి. పదేళ్లు, లేదా అంతకుమించిన వాటిని దీర్ఘకాల పెట్టుబడులు అనుకోవచ్చు. అదే సమయంలో మధ్య కాల పెట్టుబడులు 3 నుంచి 10 సంవత్సరాల వ్యవధిగా పరిగణించవచ్చు. స్వల్ప కాలం పెట్టుబడులు కొన్ని నెలల నుంచి రెండు, మూడు సంవత్సరాల వ్యవధిని తీసుకోవచ్చు.
స్వల్ప కాలం వ్యవధి పెట్టుబడుల్లో ద్రవ్య లభ్యత(లిక్విడిటీ) చాలా కీలకం. అంటే పెట్టుబడిని నగదులోకి మార్చుకునే వెసులుబాటు ఎక్కువగా ఉంది. సురక్షితంగా డబ్బులను పెట్టుబడి పెట్టేందుకు ఇవి ఉద్దేశించినవి. మిగతా పెట్టుబడి సాధానాలతో పోల్చితే వీటిలో రిస్క్ తక్కువ. స్వల్ప కాలం వ్యవధిలో పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదాయ సాధనాలు.. సేవింగ్స్ ఖాతా, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు. వీటిలో రిస్కు అనేది ఉండదు. రిటర్న్స్ కూడా అదే విధంగా తక్కువగానే ఉంటాయి.
వీటి కంటే ఎక్కువ రిటర్న్స్ పొందేందుకు ఉన్న పెట్టుబడి సాధనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లిక్విడ్ ఫండ్స్..
స్వల్ప కాలానికి ఇది సరిగ్గా సరిపోయే పెట్టుబడి సాధనం. రాబడి కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంటుంది. 91 రోజుల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. వీటికి లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. పెట్టుబడికి నష్టం వాటిల్లకుండా ద్రవ్య లభ్యత ఉండేలా చూసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇందులో రోజు, వారం, నెల వారీగా డివిడెండ్, గ్రోత్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు.
ఇందులో రిస్కు చాలా తక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెడతాయి. వడ్డీ రేట్ల రిస్కు, క్రెడిట్ రిస్కు ఉండే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు మారినట్లయితే రిటర్నులపై ప్రభావం పడుతుంది. డెట్ సాధనం ఇచ్చిన వారు తిరిగి చెల్లించలేని పక్షంలో క్రెడిట్ రిస్క్ కూడా ఉంటుంది.
షార్ట్ టర్మ్, అల్ట్రా షార్ట్ డెట్ ఫండ్స్..
అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ మెచ్యూరిటీ 3 నుంచి 6 నెలల మధ్య ఉంటుంది. సురక్షిత పెట్టుబడిగా భావించే ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఇవి ఎక్కువ రాబడిని ఇస్తాయి. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ల మెచ్యూరిటీ 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. వీటిని ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చుకోవచ్చు. అయితే ఎఫ్డీల తరహాలో మెచ్యూరిటీ కంటే ముందే పెట్టుబడిని ఉపసంహరించకుంటే పెనాల్టీ ఉండదు.